పిట్ట నుంచి కుక్క‌.. మ‌స్క్ ట్విట్టర్ వేషాలు!

ట్విట్ట‌ర్ సీఈవో.. ఎలాన్ మ‌స్క్ మ‌రో ప్ర‌యోగం చేశారు. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయ‌న ఏదో ఒక ర‌కంగా.. వార్త‌ల్లో నిలుస్తున్నారు. బ్లూ టిక్‌కు రుసుము చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. త‌ర్వాత‌.. మ‌రో నిబంధ‌న తెచ్చారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. ట్విట్టర్ లోగోను మార్చేశారు. ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్క(డాగీ మీమ్)ను తీసుకొచ్చారు. దీంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య పోతున్నారు.

ప్రస్తుతం ట్విట్టర్ వెబ్ వర్షన్లో కుక్క‌తో కూడిన కొత్త లోగో కనిపిస్తోంది. 2013లో ఈ డోజ్ మీమ్ను ఫన్నీగా క్రియేట్ చేశారు. ఈ డోజ్ మీమ్.. డోజ్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ లోగోలో కూడా ఓ భాగంగా ఉంది. అయితే, బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలకు పోటీగా డోజ్కాయిన్ ఈ ఫన్నీ లోగోను క్రియేట్ చేసింది. ట్విట్టర్ లోగో మార్చిన తర్వాత డోజ్కాయిన్ విలువ 20 శాతానికి పైగా పెరిగింది.

కొత్త లోగో మార్చిన సందర్భంగా ఓ ఫన్నీ ఫోటో కూడా ట్వీట్ చేశారు. అందులో డోజ్ కారులో వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీస్ లైసెన్స్ అడుగుతాడు. ట్విట్టర్ పిట్ట ఉన్న కార్డు ఇస్తుంది డోజ్. ఫొటో తేడాగా ఉంది అని పోలీస్ అడగగా.. అది పాత ఫోటో అని సమాధానమిస్తుంది డోజ్. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

నెటిజ‌న్ అడ‌గ‌డంతోనే!

గతేడాది ‘కొత్త ప్లాట్ఫామ్ అవసరమా’ అని అడిగారు మస్క్. దీనికి చైర్మన్ అనే యూజర్.. ‘ట్విటర్ను కొనుగోలు చేసి.. లోగోగా డోజ్ ఫొటోను మార్చండి’ అని బదులిచ్చాడు. తాజాగా ఈ ఫొటోకు ‘హామీ నెరవేర్చాను’ అని రాసుకొచ్చారు మ‌స్క్‌. మస్క్కు డోజ్ మీమ్ అంటే చాలా ఇష్టమని నెటిజ‌న్లు అంటున్నారు. ఈ డోజ్ మీమ్ను ఓ సందర్భంలో మస్క్ వాడారు.  మరోవైపు, ఏప్రిల్ ఫూల్ చేయడానికి.. ఏప్రిల్ 1న విడుదల చేయాల్సిన కొత్త లోగో.. ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు విడుదల చేశారా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిర్ణ‌యం వెనుక‌..

డోజ్కాయిన్ క్రిప్టోకరెన్సీని మస్క్ చాలా రోజులుగా ప్రమోట్ చేస్తున్నారు. 2021లో ‘సాటర్డే నైట్ లైవ్’ షో డోజ్ కాయిన్ గురించి ప్రస్తావించగా.. దాని వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల.. డోజ్కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయిం ది. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు. వారందరూ.. ఎలాన్ మస్క్పై 258 బిలియన్ డాలర్ల దావా వేశారు. దీని నుంచి బయటపడడానికే మస్క్ తాజాగా డోజ్ లోగో నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.