హమ్మయ్యా .. కోహ్లీ సెంచరీ కొట్టాడు…

క్రికెట్ నేర్చుకునే ప్రతీ ఒక్కరికీ దేశం తరపున ఆడాలన్న కోరిక ఉంటుంది. దేశం తరపున ఆడే ప్రతీ బ్యాట్స్ మెన్ కు శతకాలు బాదాలన్న ఆకాంక్ష కూడా ఉంటుంది. కాకపోతే అందరికీ టాలెంట్ సరిపోదు. కాలం కలిసిరాదు. దానితో కెరీర్ ఇలా ప్రారంభించిన అలా ముగించేస్తారు. గవాస్కర్, సచిన్, కోహ్లీ లాంటి వాళ్లు మాత్రం అలా కాదు. ఆడేందుకే పుట్టినట్లుగా సుదీర్ఘకాలం క్రికెట్లో పాతుకుపోతారు. బ్యాటింగ్ విన్యాసాలతో క్రీడాభిమానులకు ఉర్రూతలూగిస్తారు…

28వ టెస్టు సెంచరీ

కింగ్ కోహ్లీ తన టెస్టు జీవితంలో 28వ సెంచరీ పూర్తి చేశాడు. అహ్మదాబాద్ మ్యాచ్ లో ఆదివారం ఆయన ఈ రికార్డును సాధించాడు. నిజానికి 2019 నవంబరు తర్వాత విరాటుడు సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంత టాలెంట్ ఉన్న ఆటగాడికి ఇదీ సుదీర్ఘ నిరీక్షణే అవుతుంది. ఈసారి డెడికేషన్ తో ఆడి సెంచరీ చేయాలన్న సంకల్పంతోనే కోహ్లీ క్రీజ్ వద్ద నిలబడ్డాడు. కేవలం ఐదు ఫోర్లు కొట్టాడు. అనవసరంగా వికెట్ కోల్పోకూడదన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా, ఆచితూచి ఆడాడు. ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా ఫ్లీగా సింగిల్స్ తీస్తూ సెంచరీ వైపుకు దూసుకపోయాడు..

కోహ్లీ వన్డేల్లో 46 సెంచరీలు చేశాడు. టీ-20ల్లో ఒక శతకం బాదాడు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 34 సెంచరీలు కొట్టాడు. ఏ ఫార్మాట్ లోనేనా రాణించగలనని కోహ్లీ నిరూపించాడు. 34 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల కుర్రాడిలా ఆడటం కోహ్లీ స్పెషాలిటీగా చెప్పొచ్చు…