ట్రోల్స్ దెబ్బ‌కు కౌ హ‌గ్ డే ఔట్

ఫిబ్ర‌వ‌రి 14 అంటే.. అంద‌రికీ వాలెంటైన్స్ డేనే గుర్తుకు వ‌స్తుంది. ఐతే భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు ఆ డే అంటేనే గిట్ట‌దు. ఇది మ‌న సంప్ర‌దాయం కాద‌ని, విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న‌ది అంటూ ప్రేమికుల దినోత్స‌వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటారు. ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు, భ‌జ్‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు ఏటా వేలంటైన్స్ డేకి పార్కుల్లోకి వెళ్లి ప్రేమ జంట‌ల మీద దాడి చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఐతే జ‌నాల‌కు న‌చ్చిన‌ట్లు బ‌త‌క‌నివ్వ‌కుండా ఇలా దాడి చేయ‌డాన్ని స్వేచ్ఛావాదులు తీవ్రంగా త‌ప్పుబ‌డుతుంటారు. ఈ సంగ‌తిలా ఉంటే.. వేలంటైన్స్ డేను టార్గెట్ చేస్తూ కొత్త‌గా ఫిబ్ర‌వ‌రి 14కు కౌ హ‌గ్ డే జ‌రుపుకోవాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన కొత్త ఉత్త‌ర్వుల‌తో జ‌నాల‌కు మండిపోయింది. కొత్త‌గా ఇదేం సంప్ర‌దాయం అంటూ.. దీని మీద సోష‌ల్ మీడియాలో జ‌నాలు త‌మ ఆగ్ర‌హాన్ని చూపించారు.

ఆవును హ‌త్తుకుంటే స‌రిపోతుందా.. మ‌రి ఎద్దులు, గేదెలు, ఇత‌ర జంతువుల సంగ‌తేంటి.. కౌగిలించుకుంటే స‌రిపోతుందా.. ముద్దు పెట్టుకోవాలా.. ఆవును కౌగిలించుకోకుంటే జైల్లో వేస్తారా.. ఇలా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ రెండు రోజులుగా నెటిజ‌న్లు రెచ్చిపోతున్నారు. దీని మీద ఎన్నో మీమ్స్, జోక్స్ పేలాయి. రోజు రోజుకూ ట్రోలింగ్ తీవ్ర‌మ‌వుతూ వ‌చ్చింది.

జ‌నాల మీద ఇలాంటి ఆలోచ‌న‌లు రుద్దితే ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాల‌ను నెటిజ‌న్లు ఇచ్చారు. దీని వెనుక సదుద్దేశం లేద‌ని.. వాలెంటైన్స్ డేను టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్య‌మని పేర్కొంటూ నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని ప్రభుత్వం ఇక లాభం లేదని ‘కౌ హగ్ డే’ను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.