మొన్న రాళ్లు.. ఇప్పుడు వాట‌ర్ బాటిళ్లు.. హ‌ద్దు మీరిన భాషాభిమానం!

భాషాభిమానం ఉండొచ్చు. కానీ, అది కొంత‌వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాలి. కానీ, క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు ఈ అభిమానం మాటున జ‌రుగుతున్న దాడులు అంద‌రినీ నివ్వెర‌ప‌రుస్తున్నాయి. ఇటీవ‌ల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైద‌రాబాదీ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి.

ఇక‌, ఇప్పుడు తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్‌పైనా ఇదే భాషాభిమానంతో కొంద‌రు దుండ‌గులు వాట‌ర్ బాటిళ్లు విస‌ర‌డం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరలోని హంపిలో జరుగుతున్న ‘హంపి ఉత్సవ్’ ముగింపు కార్యక్రమంలో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొన్నారు. ఈ

 కార్యక్రమానికి హాజరయిన వారిలో జోష్ నింపేందుకు కొన్ని పాటలను పాడారు. అయితే.. కన్నడ పాటలు పాడలేదనే కారణంగా ఒకతను కైలాష్ ఖేర్‌పై కొంద‌రు వాట‌ర్ బాటిళ్లు విసిరారు. కన్నడ పాటలు పాడించుకోవాలనుకుంటే కన్నడ గాయకులనే ఆహ్వానించాలని, కైలాష్ ఖేర్ కన్నడ సినిమాల్లో చాలా పాటలు పాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మరికొందరేమో.. భాషను అభిమానించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ.. ఆ భాష మాట్లాడని వారిపై భౌతిక దాడులకు దిగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గ పరిణామం కాదని ట్వీట్స్ చేశారు. మొత్తానికి భాషాభిమానం పేరుతో ఇలా దాడుల‌కు దిగ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.