సంక్రాంతి వేళ గన్నవరంలో గోవా సెటప్..

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. భోగిమంటలు.. పిండి వంటలు.. సినిమాలు.. కోడి పందేలు ఇలా లిస్టు భారీగా ఉంటుంది. వాటికి మరింత కమర్షియల్ హంగుల్ని జోడించేసి.. మత్తులో ముంచేసి.. పేకాటకు పైలెవల్ అన్నట్లుగా ఉండే క్యాసినో సెటప్ ను ఏపీ స్టేట్ కు పరిచయం చేసిన క్రెడిట్ వైసీపీ సర్కారుదే చెప్పాలి. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడ కేంద్రంగా అప్పటి మంత్రికొడాలి నాని నేత్రత్వంలో.. క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ధూంధాంగా నిర్వహించిన కేసీనో సీన్ ఏపీలో మరోసారి రిపీట్ అయ్యింది.

తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోవాకు ఏ మాత్రం తగ్గని రీతిలో సిద్ధం చేసిన కేసినో సెట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది గన్నవరం. ఈసారి గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో పెద్ద ఎత్తున కోడి పందేలకు.. కేసినో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – ఏలూరు నేషనల్ హైవేకు అనుకొని ఉండే అంపాపురంలోని 16 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందేలు.. కేసినో నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భారీ కేసినో.. ఇక్కడ అందించే ‘సేవల’కు ప్రతిగా రోజుకు లక్ష మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.

అయితే.. ఈ కేసినోకు అడుగు పెట్టాలంటే జేబులోఫుల్ పైసలు ఉండాల్సిందే. సాదాసీదా వారికి అక్కడ ఎంట్రీ ఏ మాత్రం దొరికే అవకాశం లేదు. రెండు రకాల వీఐపీ పాసుల్ని అందిస్తున్నారు. మొదటిరకం పాసు ధర రూ.60వేలుగా డిసైడ్ చేస్తే.. గ్రేడ్ బి పాసు ధర రూ.40వేలుగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ వీఐపీ పాసులు తీసుకున్నవారికి 14-16 వరకు ఇక్కడ ఏర్పాటు చేసిన కేసినోలోనే ఫుడ్.. లిక్కర్.. బెడ్ ఏర్పాట్లు చేస్తుండటం గమానార్హం. పాసుల్ని క్యాష్ రూపంలోనే మాత్రమే ఇస్తారని.. ఆటగాళ్లు టోకెన్ల కొనుగోలుకు మాత్రం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులకు ఓకే చెబుతున్నట్లు చెబుతున్నారు.

లోపలకు వెళ్లే వారు ఎవరైనా సరే.. తమ ఫోన్లను గేటువద్ద ఉన్న కౌంటర్ల వద్ద ఇచ్చేసి మాత్రమే లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. కోడి పందేలకు బరులను సిద్ధం చేశారు. రూ.5 నుంచి లక్ష వరకు మొత్తం ఐదు బరులను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. పండుగ మూడు రోజుల్లో ప్రధాన బరిలోనే 100కు పైగా పందేలు వేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన ఐదు బరుల్లో మరెన్ని ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ చేసిన ఏర్పాట్లు చూస్తే.. గోవాలో ఉన్న భావన కలిగేలా సెట్టింగులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన 200 మంది బౌన్సర్లు ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడకు వచ్చే అతిధుల కోసం విజయవాడనుంచి హనుమాన్ జంక్షన్ వరకుఉన్న హోటళ్లలో దాదాపు 1500లకు పైగా గదుల్ని బుక్ చేసినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది నిర్వహించిన కేసినో మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఈసారి అదే తీరును మరింత హైటెక్ పద్దతిలో చేపట్టిన వైనం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.