కరోనా మనుషుల్ని చంపేస్తున్న ఉదంతాలు తెలిసినవే. దీని బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న బిల్లులతో గుల్లగుల్ల అయిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయిలువసూలు చేసే హైదరాబాద్ ఆసుపత్రుల తీరు మనకు తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. సదరు ఆసుపత్రి స్పందనకు ఫిదా కావటం ఖాయం. ఎందుకంటే.. తాము వేసిన రూ.1.52కోట్ల కరోనా బిల్లును పైసా కట్టకుండా మాఫీ చేయటమే దీనికి కారణం. అదెలా జరిగిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలకు చెందిన 42 ఏళ్ల రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ పనిలో చేరిన అతనికి కొద్దికాలానికే కరోనా బారిన పడ్డాడు. అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 80 రోజులు చికిత్స పొందాడు. చివరకు ఆసుపత్రి యాజమాన్యం వేసిన బిల్లు చూసి అతడి గుండె ఆగినంత పనైంది.
కారణం..ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.1.52కోట్లు కావటమే. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. బిల్లు కట్టని కారణంగా ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
తనకు ఎదురైన పరిస్థితితో పాటు.. తన ఆర్థిక స్థితిగతుల గురించి చెబుతూ భారత ఎంబసీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన ఎంబసీ ఆసుపత్రి వర్గాల్ని సంప్రదించింది. బిల్లును మినహాయించాలని కోరింది.
దీనికి స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం బిల్లును మినహాయింపు ఇవ్వటంతో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇక్కడ మరికొన్ని విషయాల్ని చెప్పాలి. చేతిలో డబ్బుల్లేని రాజేశ్ స్థితిగతుల గురించి తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం అతను ఇండియాకు వెళ్లటానికి అవసరమైన విమానటిక్కెట్లను కొనుగోలు చేసి ఇవ్వటమే కాదు.. దారి ఖర్చుల కోసం రూ.10వేలను అతని చేతిలో పెట్టింది. భారత ఎంబసీతో పాటు.. సదరు ఆసుపత్రి పెద్ద మనసు తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. తాజాగా అతను హైదరాబాద్ చేరుకున్నాడు.