ఈ మధ్యే తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్.. 50 ఓవర్ల మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. భారత దేశవాళీ టోర్నీ విజయ్ హజారె ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో అతను ఏకంగా 277 పరుగులు సాధించాడు. ఇప్పుడు అదే టోర్నీలో మరో అనూహ్యమైన రికార్డు నెలకొల్పాడు మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. అతడి ధాటికి శివ శింగ్ అనే ఉత్తర ప్రదేశ్ బౌలర్ ఏకంగా ఒకే ఓవర్లో 43 పరుగులు సమర్పించుకున్నాడు.
ఒక ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డు చూశాం కానీ.. రుతురాజ్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు. రుతురాజ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదాక.. ఆరో బంతికి నోబ్ పడింది. ఆ బంతిని కూడా అతను సిక్సర్‌గా మలిచాడు. నోబాల్ కావడంతో మరో బంతి అదనంగా వేయాల్సి వచ్చింది. దాన్ని కూడా రుతురాజ్ వదిలిపెట్టలేదు. స్టాండ్స్‌లో పడేశాడు. దీంతో ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు, మొత్తంగా 43 పరుగులు నమోదయ్యాయి. జగదీశన్ రికార్డు స్కోర్ సాధించింది అరుణాచల్ ప్రదేశ్ అనే చిన్న జట్టు మీద. కానీ రుతురాజ్ మాత్రం యూపీ లాంటి బలమైన జట్టుపై క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడు సిక్సర్ల ఘనత పూర్తి చేశాడు. జగదీశన్ రికార్డు నెలకొల్పిన విజయ్ హజారె ట్రోఫీనే ఈ రికార్డుకు కూడా వేదికగా మారింది.
ఐతే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ మాత్రం ఇది కాదు. ఒక ఓవర్లో అత్యధిక పరుగులు 77 కావడం విశేషం. అందులో విపరీతంగా ఎక్స్‌ట్రాలు ఉన్నాయి. చిన్న స్థాయి క్రికెట్ మ్యాచ్‌తో ఆ రికార్డు నమోదైంది. విజయ్ హజారె లాంటి ఒక స్థాయి ఉన్న టోర్నీలో రుతురాజ్ ఓ బలమైన జట్టు మీద ఈ రికార్డు నెలకొల్పడం విశేషమే.