‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది.
ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం.
ఆ ఇద్దరూ 9 నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు. వాళ్ల పేర్లు మాన్సి, మాన్య. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లిద్దరిలో మాన్సి ఎవరో, మాన్య ఎవరో తెలియక తికమక పడేంతగా ఇద్దరిలో పోలికలుంటాయి. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.
చదువులో ఇద్దరూ చురుకే. గత వార్షిక సంవత్సరంలో వీళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా.. ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు సాధించడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొత్తం మార్కులే కాదు.. ప్రతి సబ్జెక్టులోనూ ఆ ఇద్దరూ ఒకే మార్కులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది. కవల సోదరీమణులు మరీ ఇంత ఐడెంటికల్గా మార్కులు ఎలా తెచ్చుకున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates