ఈ మధ్యకాలంలో మీడియా ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో తెలీదుగానీ..ప్రజలకు సామాజిక బాధ్యతపై అవగాహన కాస్త పెరిగిందనే చెప్పవచ్చు. సామాజిక సమస్యలపై, ఏదైనా ఒక చారిటీ కోసమే, కొన్ని జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకో సెలబ్రిటీలు, సినీతారలతోపాటు సామాన్యులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమకు తోచింది చేస్తున్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ వంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు.
అయితే, ప్రస్తుతం చాలామంది జనం బద్ధకిస్టులగా మారిన నేపథ్యంలో ఈ రన్ లకు ఆదరణ కాస్త తగ్గింది. అందుకే, ఆస్ట్రేలియాలోని కొందరు ప్రజలు…స్కిన్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు వినూత్న తరహాలో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 2500 మంది స్వచ్చందంగా బీచ్ దగ్గరకు వచ్చి నగ్నంగా సూర్య కిరణాల ముందు నిలబడిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2,500 మంది జనం నగ్నంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆస్ట్రేలియాలో 70 సంవత్సరాల వయస్సులోపున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్కిన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే, ఈ స్కిన్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ వినూత్న అవగాహనా కార్యక్రమం చేపట్టారు. అతడిచ్చిన పిలుపునకు స్పందించి దాదాపు 2,500 మంది వ్యక్తులు ఈ నగ్న ప్రదర్శనకు సహకరించారు.
ప్రపంచం ప్రసిద్ధ ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్‌లను ప్రదర్శించడంలో టునిక్ కు మంచి పేరుంది. నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన టునిక్ 2010లో సిడ్నీలో 5,200 మంది నగ్న ఫొటో షూట్ చేశాడు.