ఓ అమ్మాయిని ప్రేమించడం.. తనతో పెళ్లి కుదరక పెద్దలు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడం.. తర్వాత ప్రేయసితో బంధాన్ని కొనసాగిచంచడం.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని వ్యవహారం నడిపించడం.. ఇవన్నీ ఎప్పుడూ వినే కథలే.
కానీ తాను ప్రేమించిన అమ్మాయిని.. అలాగే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకే సమయంలో పెళ్లాడటం.. ఇందుకు ఇద్దరమ్మాయిలూ అంగీకరించడం.. అలాగే ఆ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా దీనికి అంగీకారం తెలపడం.. అందరి సమక్షంలో ఇద్దరినీ ఒకే సమయంలో పెళ్లాడటం మాత్రం ఇప్పటిదాకా విని ఉండరు. కని ఉండదు. ఊహకందని ఈ పరిణామం మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. దీని గురించి జాతీయ మీడియాలోనూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
మూడు రోజుల కిందట జరిగిన ఆ అనూహ్య పరిణామం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని ఓ గ్రామానికి చెందిన కుర్రాడు కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఐతే అతడికి ఇటీవల పెద్దలు వేరే పెళ్లి నిశ్చయించారు. దీంతో అతను ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబ సభ్యులు గ్రామంలో పంచాయితీకి వెళ్లారు. ఆ పంచాయితీకి ఆ అబ్బాయి కుటుంబంతో పాటు తనకు పెళ్లి నిశ్చయించిన అమ్మాయి కుటుంబ సభ్యులూ హాజరయ్యారు.
ఇద్దరమ్మాయిలూ ఆ అబ్బాయి తమకే కావాలని మాట్లాడారు. అలాంటపుడు ఇద్దరూ అతణ్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అందుకు సరే అన్నారు. వారి కుటుంబ సభ్యులూ సరే అన్నారు. అబ్బాయి కుటుంబ సభ్యులకూ అభ్యంతరం లేకపోయింది. పెళ్లి తర్వాత అతను ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో సంసారం సాగించబోతున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates