అబార్షన్లకు సంబంధించి దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో నిమిత్తం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి కాలేదన్న ఏకైకా కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్ట ప్రకారం మహిళలందరికీ సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కుందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆ అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత మహిళలకు తేడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అంతేకాదు, భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. భార్యను భర్త బలవంతం చేస్తే అది రేప్ అవుతుందని స్పష్టం చేసింది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒంటరి, అవివాహిత మహిళలకు కూడా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని సుప్రీం కోర్టు తెలిపింది. ఏది ఏమైనా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు ఇపుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పును కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.