ఇండియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనల గురించి తరచుగా వివాదాలు, చర్చలు నడుస్తుంటాయి. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్న భావన కలిగించే ఈ ప్రకటనల్ని, ఈ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. కంగనా రనౌత్ లాంటి కొందరు ఫిలిం స్టార్స్ ఇలాంటి యాడ్స్‌లో నటించకూడదని నియమం కూడా పెట్టుకున్నారు.
ఇలాంటి యాడ్స్ కూడా వర్ణ వివక్షలో భాగమే అన్నది చాలామంది అభిప్రాయం. ఐతే ఎవరేమన్నా ఇండియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్ బిజినెస్ ఓ రేంజిలో సాగుతూనే ఉంది. దీని మీద కంపెనీలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. ఐతే ఇంతకుముందు విమర్శల్ని తట్టుకుని బండి నడిపిస్తూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితులు ముందులా లేవు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఉదంతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసింది.
‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వివిధ రంగాల్లో వర్ణ వివక్ష, జాత్యహంకారం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత నంబర్ వన్ ఫెయిర్‌నెస్ క్రీమ్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును మార్చాలని హిందుస్థాన్ లీవర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీని పేరుతో ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించాలని.. దాని స్థానంలో ‘గ్లో’ పెట్టాలని నిర్ణయించింది. అంటే.. ఇకపై ఈ క్రీమ్‌ను ‘గ్లో అండ్ లవ్లీ’ అని పిలవాలన్నమాట.
ఐతే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరుతో దశాబ్దాలుగా పాపులర్ అయిన క్రీమ్ పేరును ఇప్పుడు మార్చేస్తే కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదేదో కొత్త బ్రాండ్ అనుకునే ప్రమాదమూ ఉంది. దాని వల్ల సేల్స్ తగ్గొచ్చు కూడా. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పేరు మార్పు తప్పదని హిందుస్థాన్ లీవర్ భావించింది. త్వరలోనే కొత్త పేరుతో ఉత్పత్తులు బయటికి వస్తాయి.