కోట్లాది మందిని తమ ఆటతో ఆకట్టుకునే క్రికెటర్లు.. ఎంతో బాధ్యతగా ఉంటామని అనుకుంటాం. కానీ.. కొందరి పిచ్చి వేషాల గురించి తెలిస్తే.. మరీ ఇంత దారుణంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. గతంలో బెంగళూరు తరఫు ఆడి.. ఈ మధ్య జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు సొంతం చేసుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గతంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
2013లో ఒక క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని.. ఇకపై అందరికీ తెలిసిపోతుందన్న ఆయన.. తాను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగిందని పేర్కొన్నారు. బెంగళూరు జట్టుపై ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మత్తులో ఉన్నారు. చాలా సేపు నన్ను గమనించిన అతడు తన వద్దకు పిలిచాడు.
అతడి వద్దకు వెళ్లినంతనే నన్ను గట్టిగా పట్టుకొని.. 15వ అంతస్తులో వేలాడ దీశాడని చెప్పారు. ‘ఒక్కసారి భయం వేసింది. కళ్లు తిరిగాయి. నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టేసుకున్నా. ఏ మాత్రం పట్టుసడలినా నా పని అయిపోయేది. అక్కడున్న వారు వెంటనే రియాక్టు అయ్యారు. దీంతో బతికిపోయా. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ప్రాణాలతో బయపడేవాడిని కాదు. దాని తర్వాత నుంచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న దానిపై జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అంటూ తనకు ఎదురైన భయంకరమైన నిజాన్ని వెల్లడించారు.
చాహల్ వెల్లడించిన ఈ ఉదంతం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన సదరు క్రికెటర్ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించనప్పటికీ.. బీసీసీఐ ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు.. ఎవరు ఆ క్రికెటర్. అలా వ్యవహరించిన దానికి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మరి.. ఆ క్రికెటర్ ఎవరన్న విషయాన్నిచాహల్ బయటపెడతారా? బీసీసీఐ అయినా జోక్యం చేసుకుంటుందా? అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates