ఆసుపత్రుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అక్కడ తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని ఎలాంటి విషాదాలు మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. ఒక కరోనా పేషెంట్.. కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ పేషెంట్‌ను చూసేందుకు వచ్చి ఆసుపత్రిలో ఉక్కపోతగా ఉండటంతో కూలర్ ఆన్ చేయడం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
కూలర్ ప్లగ్ పెట్టడం కోసం పేషెంట్‌కు పెట్టిన వెంటిలేటర్ ప్లగ్‌ను తీసి పక్కన పడేశారు అతడి కుటుంబ సభ్యులు. దీంతో అతడి ప్రాణాలు పోయాయి. రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 13న 40 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి మహారావ్ భీమ్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది.
ఐతే ఆ వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. దీంతో అతణ్ని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చారు. కరోనా లేకపోయినప్పటికీ అతను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ అవసరమైంది. ఐతే ఐసోలేషన్ వార్డులో బాగా ఉక్కపోతగా ఉండటంతో కుటుంబ సభ్యులు కూలర్ తీసుకొచ్చారు. దాని ప్లగ్ పెట్టే సాకెట్ కోసం చూడగా ఖాళీ కనిపించలేదు. దీంతో కనిపించిన ఒక ప్లగ్ తీసి దాన్ని అమర్చారు. వాళ్లు తీసింది వెంటిలేటర్ ప్లగ్ అని తెలియలేదు. అరగంట పాటు దానికి పవర్ అందలేదు. పేషెంట్‌కు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. చివరికి ప్రాణాలే పోయాయి.
వైద్యులు వచ్చి పరిశీలిస్తే వెంటిలేటర్ పని చేయట్లేదని తేలింది. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు విచారణకు సహకరించడం లేదని ఆసుపత్రి సూపరిండెండెంట్ మీడియాకు తెలిపారు.