మొబైల్ ఫోన్ వినియోగంపై తమిళనాడు హైకోర్టులోని మధురై ధర్మాసనం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. పని వేళ్ళల్లో ఉద్యోగులు ఎవరు మొబైల్ ఫోన్లను వాడేందుకు లేదని తీర్పు చెప్పింది. పని వేళ్ళల్లో కూడా ఉద్యోగులు మొబైల్ ఫోన్లను ఉపయోగించటం, వీడియోలు తీయటం, వీడియోలు చూస్తు టైంపాస్ చేయడం ఎక్కువైపోతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే అని చెప్పింది.
ఉద్యోగులు యధేచ్చగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుండటం వల్ల అవసరాల కోసం ఆఫీసులకు వచ్చే జనాలను ఉద్యోగులు పట్టించుకోవటం లేదన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుచ్చి ఆరోగ్య మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా సూపర్ వైజర్ పని వేళ్ళల్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండటం, వీడియోలు తీసుకుంటోందనే ఆరోపణలొచ్చాయి. దాంతో విచారణ జరిపిన ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. దాంతో ఆమె ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు వేశారు.
ఆ కేసును విచారించిన మధురై దర్మాసనం మొబైల్ వినియోగం విషయంలో పై ఆదేశాలను జారీ చేసింది. అవసరార్ధం ఉద్యోగులందరు మొబైల్ ఫోన్లను ఉపయోగించేందుకు ప్రతి కార్యాలయంలోను ఒక మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. అలాగే ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయటం, వైబ్రేషన్, సైలెంట్ మోడ్ లో పెట్టాలని ధర్మాసనం తీర్పిచ్చింది. వివిధ అవసరాల కోసం ఆఫీసులకు వచ్చే జనాలకు పనులు చేసిపెట్టడమే ఉద్యోగుల బాధ్యతగా కోర్టు స్పష్టంగా చెప్పింది.
ప్రతి ఆఫీసులోను క్లోక్ రూమ్ ఏర్పాటుచేసి ఉద్యోగుల ఫోన్లను అక్కడ ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయాల అధికారుల ఫోన్లను ఇతర ఉద్యోగులు కూడా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోర్టు చెప్పింది. వీలైనంతలో సెల్ వాడకాన్ని పనివేళ్ళల్లో తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్చలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలను నాలుగు వారాల్లో అమల్లోకి తీసుకురావటానికి ప్రభుత్వం అవసరమైన కార్యాచరణను రెడీ చేయాలని చెప్పింది. సస్పెన్షన్ కేసును విచారిస్తామని కూడా చెప్పింది. మొత్తం మీద మధురై ధర్మాసనం ఇచ్చిన తీర్పు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయితే బాగుంటుంది.