పాకిస్ధాన్ ఉగ్రవాదులకు హెరాయిన్ నిదులు
విజయవాడలోని సత్యనారాయణపురం ఆషీ ట్రేడర్స్ అడ్రస్ తో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాపారం నిధులంతా పాకిస్ధాన్లోని ఉగ్రవాదులకు అందుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జిషీటులో స్పష్టంగా చెప్పింది. ఆషీ ట్రేడర్స్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుని అనేక రాష్ట్రాల్లో అమ్ముతున్న మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలితో పాటు మరో 14 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అప్పట్లో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ రూపంలో పట్టుబడిన హెరాయిన్ దేశంలో సంచలనం సృష్టించింది. అప్పట్లో పట్టుబడిన 3 వేల కిలోల హెరాయిన్ విలువ సుమారు రు. 24 వేల కోట్లుంటుంది. ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న మాదక ద్రవ్యాలను అమ్మేసి వచ్చిన వేల కోట్ల రూపాయలను పాకిస్ధాన్లోని ఉగ్రవాద గ్రూపులకు అందచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదించిన డబ్బునంతా పాకిస్ధాన్ కు హవాలా మార్గంలో పంపుతున్నట్లు ఎన్ఐఏ తన చార్జిషీటులో చెప్పింది.
ఆప్ఘనిస్ధాన్+పాకిస్ధాన్ లోని ఉగ్రవాద సంస్ధలకు సుధాకర్, ఆయన భార్య మరో 14 మంది చేతులు కలిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాద గ్రూపులతో సుధాకర్ దంపతులతో పాటు మరికొందరు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ చెప్పింది. ఎన్ఐఏ చెప్పినదాని ప్రకారం సుధాకర దంపతులతో పాటు మరికొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడినట్లు చార్జిషీటులో చెప్పింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వస్తున్న హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు పంజాబ్, ఢిల్లీ, బెంగుళూరు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది.
అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలనంతా రకరకాల వ్యాపారస్తులు, డీలర్లు, పెడలర్లు తదితరాల రూపంలో మామూలు జనాలకు అందిస్తున్నారు. మామూలు జనాల్లో కూడా ప్రధానంగా కళాశాలలు, స్కూళ్ళ విద్యార్ధులే టార్గెట్ గా అమ్మకాలు జరుగుతున్నట్లు అందరికీ తెలిసిందే. యువతలో మాదకద్రవ్యాల వాడకం చాలా ఎక్కువైపోతోందనే విషయాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అయినా దీన్ని అరికట్టడం సాధ్యం కావడం లేదు. మొత్తం మీద ఎన్ఐఏ తాజాగా బయటపెట్టిన చార్జిషీటులో ఉగ్రవాదులతో సంబంధాలు బయటపడటమే ఆశ్చర్యంగా ఉంది.