ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా డాలర్ కున్న విలువ మరే కరెన్సీకి లేదు. ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా అమెరికా డాలర్ అంటే హాట్ కేకులాగ చెలామణి అయిపోతుంది. అందుకనే అమెరికా డాలర్ అంటే యావత్ ప్రపంచంలో అంత క్రేజుంది.
అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి ఆలోచిస్తున్నాయట. దీనికి కారణం ఏమిటంటే వీళ్ళ యుద్ధం వల్ల చాలా దేశాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా రష్యాతో వ్యాపారాలు చేస్తున్న ఇండియా, యూరోపు దేశాలపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రష్యాకు ఎగుమతులు, దిగుమతులపై అమెరికా నిషేధం విధించడం పెద్ద సమస్యగా మారిపోయింది. దీనివల్ల ఏమైందంటే రష్యా నుండి ఎగుమతయ్యే గ్యాస్, చమురు, సహజవాయుల వ్యాపారానికి పెద్ద దెబ్బపడింది.
ఇందులో భాగంగానే ఇప్పటివరకు భారత్ కొన్న ధరలకన్నా చమురును తక్కువ ధరలకే ఇస్తామంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది. యుద్ధం కారణంగా రష్యాకు అమెరికా డాలర్లు ఇచ్చే అవకాశం ఎలాగు లేదు. దాంతో మన రూపాయల్లోనే చెల్లింపులు తీసుకునే విషయాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా రూబల్స్ లో కూడా చెల్లింపులు చేయవచ్చు కానీ అంత పెద్దమొత్తంలో మన దగ్గర రూబుల్స్ లేవు. కాబట్టి రూపాయల్లో కానీ లేదా బంగారం రూపంలో కానీ చెల్లింపులను పరిశీలిస్తున్నారు.
పై రెండు పద్దతులకు రష్యా దాదాపు ఆమోదం తెలిపే అవకాశముంది. అయితే ఇందులో కూడా బంగారం కాకుండా రూపాయల్లోనే చెల్లింపులకు మనదేశం ప్రయత్నిస్తోంది. ఒకసారి రష్యా అంగీకరిస్తే మన రూపాయికి అంతర్జాతీయ గుర్తింపుకు మొదటి మెట్టు ఎక్కినట్లే. ఎందుకంటే ఇదే పద్దతిని కేంద్రప్రభుత్వం ఇతర దేశాలతో కూడా షరతులు విధిస్తుంది. ఎలాగూ యుద్ధం కారణంగా చాలా దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే మరికొన్ని దేశాలు కూడా మన రూపాయలను తీసుకునే అవకావముంది. అదే జరిగితే మన రూపాయికి కూడా అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు రావటం ఏమంత కష్టంకాదు. నిజంగా ఇది మనకు హ్యాపీ న్యూసనే చెప్పాలి.