ఉక్రెయిన్ అధ్య‌క్షుడికి ప్ర‌ధాని మోడీ ఫోన్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో భాగంగా.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీంతోపాటు ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో అందించిన సహకారానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

సుమీ నుంచి భారతీయుల తరలింపునకు సహకారం కావాలని కోరారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోడీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్‌ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.

ఉక్రెయిన్పై భీకర దాడులకు మరోమారు విరామమిచ్చింది రష్యా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ వినతి మేరకు.. మానవతా కారిడార్ ఏర్పాటు కోసం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు స్పుత్నిక్ మీడియా వెల్లడించింది.

తమ దేశంలోని రక్షణ పరిశ్రమలపై బాంబు దాడులకు పాల్పడతామని రష్యా ప్రకటించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. వీటిలో చాలా పరిశ్రమలు నివాసిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై ఏ ప్రపంచ నేత స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని.. ఆ దేశ వైఖరే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.