ఉక్రెయిన్ నుంచి పారిపోయిన అధ్య‌క్షుడు!

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ.. ఆ దేశాన్ని వ‌దిలి వెళ్లిపోయాడా?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు వెన్ను చూపేది లేద‌ని.. ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తాజాగా అణు యుద్ధానికి సైతం ర‌ష్యా వెనుదీయ‌ని ప‌రిస్థితిలోకి వ‌చ్చేయ‌డంతో ఆయ‌న ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారా? అంటే.. రష్యా మీడియా ఔన‌నే అంటోంది. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ.. త‌న కుటుంబంతో స‌హా పోలాండ్‌కు పారిపోయార‌ని.. ప్ర‌క‌టించింది. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఉక్రెయిన్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోవ‌డం అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

మ‌రోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. రష్యన్లందరూ ఏకమై తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలవాలని క్రెమ్లిన్(పుతిన్ అధికారిక నివాసం)  పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఇరుపక్షాల చర్చలపై ఉక్రెయిన్‌ స్పందన ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిది దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. చర్చ ల్లో భాగంగా ఉక్రెయిన్‌తో ఇంకా ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని, అయితే యుద్ధానికి పరిష్కారంగా దేన్ని భావిస్తున్నామో ఆ దేశ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరపోరు ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం..ఈ యుద్ధంతో మళ్లీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. అటు ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్ల తయారీకి కీలకమైన నియాన్‌, పల్లాడియం ఉత్పత్తిలో సింహభాగం రష్యా, ఉక్రెయిన్‌ నుంచే ఎగుమతి అవుతుండటం ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

ఇదిలావుంటే, ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో రష్యా చేపట్టిన దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ(ఐఏఈఏ) ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. న్యూక్లియర్‌ ప్లాంట్‌ భద్రత ప్రమాదంలో పడిన నేపథ్యంలో.. సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. త్వరలో ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు.. ఈ మేరకు ఉక్రెయిన్‌, రష్యాలకు సమాచారం అందించానని ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ మారియానో గ్రోసి తెలిపారు. అయితే, దాడులతో అక్కడి ఆరు అణు రియాక్టర్లపై ఎటువంటి ప్రభావం పడలేదని వెల్లడించారు.