తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. లేదా.. కులాంతర వివాహం చేసుకుందని.. తల్లిదండ్రులు ఇక ఆమెను వదిలించుకుం టామంటే కుదరదు. ఆ యువతి రక్షణ, ఆర్థిక బాధ్యతలను తండ్రి చూడవలసిందే. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటనపై విచారణ జరిపిన కోర్టు యువతి తండ్రి అన్ని విధాలా ఆమెకు రక్షణ కల్పించాల్సిందేనని.. మైనార్టీ తీరిన తర్వాత.. వివాహం అనేది ఆ యువతి తీసుకునే వ్యక్తిగత నిర్ణయం ఆమె స్వేచ్ఛ ప్రకారమే జరుగుతుందని.. అలాగని తమ బాధ్యతల నుంచి తండ్రి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు భోపాల్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ ఎంఎస్ భట్టిలు తీర్పు వెలువరించారు.
ఏం జరిగింది?
మధ్య ప్రదేశ్ హోషంగాబాద్‌కు చెందిన ఫైజల్ ఖాన్.. ఓ యువతిని(19)ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే.. ఇది కులాంతర వివాహమని భావించిన యువతి తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించి.. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. యువతీయువకులను వెతికి పట్టుకున్నారు. ఈ సమయంలో యువతి.. తన ఇష్టప్రకారమే అతనిని వివాహం చేసుకున్నట్టు చెప్పింది.
అయితే.. ఈ ఘటనను జీర్ణించుకోలేని తల్లిదండ్రులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫిబ్రవరిలో ఇటార్సీ పోలీసులు ఎస్డీఎం ముందువారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయడానికి పిలిపించారు. అదే సమయంలో అమ్మాయి తల్లితండ్రులు ఆమెను బలవంతగా మహిళ ఆశ్రమానికి పంపించారు. దీనిపై ఫైసల్ ఖాన్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రియురాలిని ఆమె కుటుంబసభ్యులు మహిళా ఆశ్రమంలో బంధించారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. ప్రస్తుతం ఆమె వయసు 19 సంవత్సరాలను.. తన ప్రియురాలి కంటే తను వయసులో పెద్దవాడినని పేర్కోన్నాడు. జనవరి మొదటి వారంలో తన ప్రియురాలి ఇంటి నుంచి బయటకు వచ్చి తనతోపాటే నివసిస్తుందని తెలిపారు.
దీనిపై విచారణ జరిగిన అనంతరం ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఉంటానని చెప్పింది. అనంతరం.. ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు మాత్రమే అని.. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత పెళ్లి జరిపించాలని.. కులాంతరం వివాహం జరిగిన తర్వాత కూడా కూతురు బాధ్యత తండ్రికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. వివాహం జరిగిన తర్వాత తమ కూతురుకు ఎల్లప్పుడు రక్షణగా ఉంటూ తనకు ప్రేమను అందించాలని.. అలాగే ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.