అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో సంచ‌ల‌న తీర్పు.. 38 మందికి మ‌ర‌ణ శిక్ష‌

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన
తీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 11 వందల మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.

2008వ సంవత్సరం జూలై 26న అహ్మదాబాద్ నగరంలోని 21 ప్రాంతాల్లో   వరుస బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి.  ఈ ఘటనలో 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుళ్లకు తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహీద్దీన్ ప్రకటించుకుంది. దీని వెనుక పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. కాగా… బెంగళూరులో బాంబు దాడి జరిగిన మరుసటి రోజే అహ్మదాబాద్ లో బాంబుపేలుళ్లు జరగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

దాదాపు 13 సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అప్ప‌ట్లో ఈ కేసుపై అనేక రాజ‌కీయ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. దీంతో రాజ‌కీయ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ప్ర‌త్య‌క కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం.