బెజవాడలో అంతలా పాకేసిందా?

అంతకంతకూ విస్తరిస్తున్న పాజిటివ్ కేసులు కొన్ని నగరాలు.. పట్టణాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ నగరంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో బెజవాడ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం బెజవాడలో సగానికి పైగా ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించిందని చెబుతున్నారు.

అంతేకాదు.. కంటైన్మెంట్ జోన్లు కూడా భారీగా పెరిగాయి. విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉంటే.. అందులో 62 డివిజన్లు కట్టడి ప్రాంతాలుగా పేర్కొనటం చూస్తే.. మహమ్మారి తీవ్రత ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమైపోతుంది. పెద్ద ఎత్తున నమోదవుతున్నకేసులతో అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేశారు జిల్లా కలెక్టర్. నగరంలోని కీలక ప్రాంతాలన్ని కట్టడి కేంద్రాలుగా మారాయి.

కనకదుర్గ గుడి ప్రాంతం కూడా కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెజవాడకు రాకపోకల విషయంలోనూ పరిమితులు విధించాలని నిర్ణయించారు. బెజవాడలోకి వెళ్లే వారు.. ఆ నగరం నుంచి బయటకు వచ్చే వారి విషయంలో ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. రవాణా సౌకర్యాన్ని దాదాపుగా నిలిపివేయటంతో పాటు.. అత్యవసర సేవలకు చెందిన వాహనాల్ని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. బెజవాడకు భారీ ఎత్తున సుస్తీ చేసినట్లేనన్న అభిప్రాయం కలుగక మానదు.