వెంకన్న దర్శనం టిక్కెట్టు.. రూ.1 కోటి

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు.. తిరుమ‌ల శ్రీవారిని ఆపాద‌మ‌స్త‌కం ద‌ర్శించి త‌రించాల‌ని.. ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. అంతేకాదు.. ఆయ‌న‌కు నిత్యం జ‌రిగే అనేక సేవ‌ల్లో పాల్గొని జీవితాన్ని చ‌రితార్థం చేసుకోవాల‌ని ఎవ‌రు మాత్రం అనుకోరు. అయితే.. ఇప్పుడున్న సౌక‌ర్యాల మేర‌కు.. ప్ర‌తి సేవకు ఒక్కొక్క టికెట్ తీసుకోవాలి. అది కూడా ఒక్కో సేవ‌కు ఒక్కొక్క స‌మ‌యం. దీంతో అన్ని సేవ‌ల్లో పాల్గొనే అవ‌కాశం భ‌క్తుల‌కు లేకుండా పోతోంది. ఈ నేప‌థ్యంలోనే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. స‌రికొత్త ఆలోచన చేసింది. స్వామికి జ‌రిగి అన్ని సేవ‌ల్లోనూ భ‌క్తులు ఏక‌కాలంలో పాల్గొనేలా టికెట్‌ను తీసుకురానుంది.

రూ. కోటితో ఒక టికెట్‌ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టికెట్‌తో ఉద‌యం శ్రీవారికి నిర్వ‌హించే సుప్ర‌భాత సేవ నుంచి రాత్రికి నిర్వ‌హించే.. ప‌వ‌ళింపు సేవ వ‌ర‌కు.. భ‌క్తులు అన్ని సేవ‌ల్లోనూ పాల్గొనే అవ‌కాశం క‌ల్పిస్తారు. అయితే.. ఇంత ఖ‌రీదు పెట్టి సాధార‌ణ భ‌క్తులు సేవ‌ల్లో పాల్గొనే అవ‌కాశం లేద‌న్న వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. దీనిని పారిశ్రామిక‌ వ‌ర్గాల‌ను దృస్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు.. టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. మున్ముందు.. భ‌క్తుల విజ్ఞ‌ప్తిని బ‌ట్టి.. 50 ల‌క్ష‌ల‌కు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక‌, ఈ టికెట్‌పై ఉదయం సుప్రభాత సేవతో మొదలు పెట్టి.. తోమాల సేవ, కొలువు, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారి అభిషేకం, వస్త్రాలంకరణ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావై, సహస్ర దీపాలంకరణ సేవ.. చివరిగా ఏకాంత సేవ.. అలా అన్ని సేవల్లోనూ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈనెల 23 నుంచి ఈ ఉదయాస్తమాన సేవ ట్రయల్ రన్ మొదలవుతుంది. జనవరి రెండోవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.

ఉద‌యాస్త‌మాన సేవ టికెట్ ద్వారా.. క‌నీసం 600 కోట్ల రూపాయ‌లు టీటీడీకి ఆదాయంగా ల‌భిస్తుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నిధుల‌ను టీటీడీ ఆధ్వ‌ర్యంలో చిన్నారుల కోసం నిర్మిస్తున్న ఆల‌యాల‌కు వినియోగించ‌నున్నారు. ఇప్ప‌టికే బ‌ర్డ్‌(చిన్నారుల ఆసుప‌త్రి) ఆసుప‌త్రుల‌ను ప్ర‌తి జిల్లాకు ఒక‌టి చొప్పున నిర్మించాల‌ని తిరుమ‌ల అధికారులు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనేనిధుల కోసం.. ఈ టికెట్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నార‌ని అంటున్నారు. మ‌రి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.