జస్టిస్ చంద్రు.. విచారణ జరగాల్సిందే

అవును ఇపుడు మెజారిటి జనాలు ఏపీ హైకోర్టు విషయంలో జస్టిస్ చంద్రు ఈమధ్య చేసిన వ్యాఖ్యలపై విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇపుడీ డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజే కారణం. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్ధ మీద నమ్మకం పోయేలా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ చంద్రుపై సూమోటోగా కేసు నమోదుచేసుకుని విచారణ చేయాలని రఘురామ విజ్ఞప్తిచేశారు.

ఎప్పుడైతే రఘురామ లేఖ రాసిన విషయం వెలుగుచూసిందో అప్పటి నుండే సోషల్ మీడియాలో చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరగాల్సిందే అనే డిమాండ్లు కూడా ఊపందుకుంటున్నాయి. మానవహక్కుల దినోత్సవం రోజున జస్టిస్ చంద్రు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రభుత్వం హైకోర్టుతో పోరాటం చేయాల్సొస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో ప్రభుత్వం అభ్యంతరం చెప్పినా ఇద్దరు న్యాయమూర్తులు పక్కకు తప్పుకోకపోవటాన్ని చంద్రు తప్పుపట్టారు.

అలాగే పాలనా వ్యవస్ధను న్యాయవ్యవస్ధ ఎలా శాసిస్తుందని చంద్రు ప్రశ్నించారు. తామడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు చెప్పని కారణంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాల్సుంటుందని హైకోర్టు వ్యాఖ్యలు చేయటాన్ని కూడా జస్టిస్ చంద్రు తప్పుపట్టారు. ఇలాంటివే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే చంద్రు వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్+జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే జస్టిస్ చంద్రు అనేదేదో అన్నారు దాన్ని చీఫ్ జస్టిస్ అంతే తీవ్రంగా ఖండించారు. దాంతో వివాదం జస్టిస్ వర్సెస్ చీఫ్ జస్టిస్ అన్నట్లుగా ముగిసిపోయింది. ఈ వివాదంతో ఎలాంటి సంబంధంలేని తిరుగుబాటు ఎంపీ మధ్యలో దూరారు. చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి చంద్రు వ్యాఖ్యలపై విచారణ జరగాల్సిందే అని కోరారు. దాంతో నెటిజన్లు కూడా ఎంపీకే మద్దతు తెలుపుతున్నారు.

విచారణ జరిపితే కానీ జస్టిస్ చంద్రు వ్యాఖ్యల్లోని నిజాలెంతో తెలీవని మెజారిటి జనాలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జస్టిస్ చంద్రుకు మద్దతుగా వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేకచోట్ల ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకవేళ చీఫ్ జస్టిస్ విచారణకు ఆదేశిస్తే జస్టిస్ చంద్రు కోర్టులో తన వాదనలను తానే వినిపించుకుంటారనటంలో సందేహం లేదు. అప్పుడు వాద ప్రతివాదనలు రంజుంగా ఉంటాయి.  మరి తిరుగుబాటు ఎంపీ లేఖలో కోరినట్లు చీఫ్ జస్టిస్ గనుక సూమోటోగా విచారణ మొదలుపెడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.