ఆదివారం మధ్యాహ్నం నుంచి ట్విట్టర్లో అజింక్య రహానె పేరు ప్రముఖంగా ట్రెండ్ అవుతోంది. అలా అని అతనేమీ గొప్ప ఇన్నింగ్స్ ఆడేయలేదు. తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న స్థితిలో 36 పరుగులే చేసి ఔటయ్యాడు అజింక్య. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అశ్విన్ పోరాడబట్టి భారత్ 345 పరుగులు చేయగలిగింది.
ఐతే రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే 2 వికెట్లు పడ్డ స్థితిలో క్రీజులోకి వచ్చాడు రహానె. అప్పటికి భారత్ ఆధిక్యం 81 పరుగులు మాత్రమే. కోహ్లి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆటగాడు ఈ స్థితిలో పట్టుదలతో క్రీజులో నిలవాలి. కెప్టెన్‌గానే కాక ఒక సీనియర్‌గా అతను అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన సమయమిది. కానీ అతను కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. రహానె ఔటైన కాసేపటికే ఇంకో రెండు వికెట్లు పడి భారత్ 51/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయం పక్కా అనుకున్న మ్యాచ్‌లో ఓటమి ముప్పు తలెత్తిన పరిస్థితి ఇది.
దీంతో భారత అభిమానులకు మామూలుగా మండిపోలేదు. రహానెను సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు జట్టులో ఉండటానికే అర్హత లేని ఆటగాడికి కెప్టెన్సీ ఏంటని అతడి మీద మండిపడుతున్నారు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని కోహ్లి స్వదేశానికి వచ్చేసిన పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టి జట్టును గెలిపించడమే కాక.. సిరీస్ కూడా అందించాడన్న ఒక్క కారణంతో రహానె అంతకుముందు వైఫల్యాలన్నీ మరిచిపోయి సెలక్టర్లు అతడిని జట్టులో కొనసాగించారు.
కానీ అతను వైఫల్యాల పరంపర కొనసాగింది. జట్టుకు ఎంతో అవసరమైన స్థితిలోనూ రహానె విఫలమవుతుండటంతో భారత క్రికెట్ అభిమానులు అతడి పట్ల మామూలు కోపంతో లేదు. శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టులోనే శతకం, అర్ధశతకం కొట్టి తనేంటో రుజువు చేసుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌కు కోహ్లి జట్టులోకి తిరిగొస్తున్నాడు. కాబట్టి ఫామ్ పరంగా చూస్తే రహానె తన స్థానాన్ని శ్రేయస్ కోసం త్యాగం చేయక తప్పదేమో. ఒక మ్యాచ్‌కు నాయకత్వం వహించి.. తర్వాతి మ్యాచ్‌కు జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడిగా రికార్డులకెక్కబోతున్నాడేమో రహానె.