క్రిప్టో కరెన్సీ ఇపుడు యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇదే. క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సురక్షితం కాదని ప్రభుత్వాలతో పాటు ఆర్థిక నిపుణులు ఎంతో మొత్తుకుంటున్నారు. అయినా పెట్టుబడులు పెట్టే స్తోమత ఉన్న ఎవరెంత చెప్పినా ఏ మాత్రం లెక్కచేయటం లేదు. నూరుశాతం రిస్కుందని తెలిసి కూడా పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటో అదృష్టం తలుపుతడితే రాత్రికి రాత్రి లక్షాధికారి లేకపోతో అదృష్టం వచ్చి ఒళ్ళో వాలితే కోటీశ్వరులు కూడా అయిపోవచ్చనే ఆశే.
ఇప్పుడు విషయం ఏమిటంటే క్రిప్టో కరెన్సీని నిర్వహించే కంపెనీలు మన దేశం నుంచి తరలిపోవటానికి రెడీ అయిపోతున్నాయట. పొరుగునే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్ లో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకోవటానికి కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏమిటంటే క్రిప్టో కరెన్సీని దేశంలో బ్యాన్ చేయాలని కేంద్రం ఆలోచిస్తుండటమే. సోమవారం అంటే 29వ తేదీనుండి మొదలవ్వబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కంపెనీల బ్యాన్ బిల్లును కేంద్రం తీసుకురాబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో బ్యాన్ బిల్లు రావడం ఖాయమని అందరు అనుకుంటున్నారు. అందుకనే పై దేశాల్లో ఆఫీసులను తెరవటానికి రెడీ అయిపోతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో క్రిప్టో కరెన్సీని నిర్వహిస్తున్న కంపెనీలు 20 ఉన్నాయి. ఈ కంపెనీలు మొత్తంలో సుమారు రు. 75 వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. క్రిప్టో కరెన్సీకి దేశంలో ఎంత క్రేజు పెరిగిపోతోందంటే 2020 ఏప్రిల్ లో 90 కోట్ల డాలర్ల పెట్టుబడులు 2021 నవంబర్ కు వెయ్యి కోట్ల డాలర్లకు చేరుకోవటమే దీని క్రేజుకు నిదర్శనం.
క్రిప్టో కరెన్సీలో చాలా రకాలే ఉన్నాయి. మన రెగ్యులర్ కరెన్సీలో అంతర్జాతీయ స్థాయిలో డాలర్ కు ఎంతటి డిమాండ్ ఉందో క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ కు అంతే డిమాండ్ ఉంది. క్రిప్టో కరెన్సీలో రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో భిక్షాధికారులు అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు 24 గంటలూ మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తునే ఉండాలి. అయితే ఇది అందరి వల్లా సాధ్యం కాదు కాబట్టే అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు.
క్రిప్టో కరెన్సీ, స్టార్టప్ ఆఫీసుల్లో సుమారు 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకవేళ కేంద్రం గనుక క్రిప్టోపై బ్యాన్ పెడితే ఆఫీసులన్నీ విదేశాలకు వెళిపోతాయి. అప్పుడు వేలాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకోవటం ఖాయం. వీరిలో చాలా కొద్దిమందిని మాత్రమే కంపెనీలు విదేశాలకు తీసుకెళుతాయి. మిగిలిన వారంతా రోడ్డున పడాల్సిందే. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీని ఎక్కువగా రియల్ ఎస్టేట్, మనీ ల్యాండరింగ్, మానవ అక్రమ రవాణా, ఆయుధాల కొనుగోలు, మాదకద్రవ్యాల రవాణాలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఉపయోగపడుతోందని అర్ధమవుతోంది. మరి కేంద్రం ఏమి చేస్తుందనే విషయంపై ఆసక్తి పెరిగిపోతోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.