క‌రోనా దేవికి పూజ‌లు పున‌స్కారాలు

చాలామందిలో భ‌యం నుంచి భ‌క్తి పుడుతుంది. భ‌యం వ‌ల్ల భ‌క్తి ఇంకా పెరుగుతుంది కూడా. క‌ష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ న‌మ్మ‌కాలున్న వాళ్ల‌యితే మ‌రీనూ. ఈ క్ర‌మంలో వాళ్లు చేసే ప‌నులు మ‌రీ త‌మాషాగా కూడా త‌యార‌వుతాయి. ఈ స్థితిలో వారి అమాయ‌క‌త్వానికి న‌వ్వుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం.

ఉత్త‌రాదిన బాగా వెనుక‌బ‌డిన రాష్ట్రాల్లో ఒక‌టైన‌ బీహార్‌లో క‌రోనా వైర‌స్ భ‌యంతో గ్రామీణ మ‌హిళ‌లు చేస్తున్న ప‌నులు చూసి అంతా షాక‌వుతున్నారు. కొత్త‌గా క‌రోనా దేవి అనే దేవ‌త‌ను సృష్టించి.. వైర‌స్ బారి నుంచి త‌మ‌ను కాపాడాలంటూ ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు అక్క‌డివాళ్లు.

న‌లంద‌, గోపాల్‌గంజ్‌, సార‌న్‌, వైశాలి, ముజ‌ఫ్ఫ‌ర్ పూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పుడు క‌రోనా దేవి అనే దేవ‌త నామాన్ని జ‌నాలు జ‌పిస్తున్నారు. త‌మ‌ను కాపాడ‌మ‌ని వేడుకుంటున్నారు. క‌రోనా అనే దేవ‌త త‌మ‌పై ప‌గ‌బ‌ట్టింద‌ని.. అందుకే ఈ వైర‌స్ ప్ర‌బ‌లుతోంద‌ని.. ఆ దేవ‌త‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తే శాంతించి.. వైర‌స్ త‌మ జోలికి రాకుండా చూస్తుంద‌ని అక్క‌డి వారు న‌మ్ముతున్నారు.

త‌మ గ్రామాల‌కు స‌మీపంలోని చెరువులు, న‌దుల ద‌గ్గ‌రికెళ్లి.. అక్క‌డ చిన్న చిన్న గుంత‌లు త‌వ్వి బెల్లం పాన‌కం, ల‌డ్డూలు, యాల‌కులు, ల‌వంగాలు లాంటి ఏడు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను దేవ‌త‌కు స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవ‌త శాంతిస్తుంద‌న్న‌ది వారి మూఢ న‌మ్మ‌కం.

ఈ ఒర‌వ‌డి రోజు రోజుకూ పెరిగి జ‌నాలు పెద్ద ఎత్తున పూజ‌ల్లో నిమ‌గ్న‌మ‌వుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవ‌ట్లేద‌ని మీడియాలో వార్త‌లొస్తున్నాయి.