జూనియర్ కొవాగ్జిన్ వచ్చేసింది.. పిల్లలకు ఓకే చెప్పేసినట్లే!

ప్రపంచానికి వణుకు పుట్టించిన కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం.. ఎట్టకేలకు కొన్ని కంపెనీలు టీకాలు తయారు చేసి.. వ్యాక్సినేషన్ షురూ చేయటం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. భారత్ లో మాత్రం మూడు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్.. కొవిషీల్డ్.. స్పుత్నిక్) అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు మాత్రమే సిద్ధం చేసిన వ్యాక్సిన్ తో పాటు.. పిల్లలకు సరిపడేలా టీకాల తయారీ మీద పలు కంపెనీలు ఫోకస్ చేశాయి.

తాజాగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పిల్లలకు సరిపోయేలా కొవాగ్జిన్ ను సిద్ధం చేసింది దీన్ని అత్యవసర అనుమతులు జారీ చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఈ వ్యాక్సిన్ ను 2-18 ఏళ్ల వారికి ఇచ్చేలా సి్ధం చేశారు. ఇప్పటికే ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ప్రయోగాలు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు భారత్ బయోటెక్ అందజేసింది. ఈ నివేదికను నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ ఓకే చేసింది. దీంతో.. కేంద్రం ఆమోదముద్ర వేయటమే మిగిలి ఉంది.

కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినంతనే.. దేశీయంగా పిల్లలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. కొవాగ్జిన్ జూనియర్ గా పిలిచే ఈ టీకాను కూడా రెండు డోసుల్లో వేయనున్నారు. మొదటి టీకా వేసిన 20 రోజులకు రెండో టీకా ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా జైకోవ్ -డి టీకాను తయారు చేసింది. ఈ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేశారు. అయితే.. ఈ సంస్థ తన టీకాను బయటకు తీసుకురాలేదు. ఇంతలోనే భారత్ బయోటెక్ కేంద్రం అనుమతుల వరకు వచ్చేసింది. ఒకవేళ.. సర్కారు ఓకే చెబితే.. పిల్లల కొవాగ్జిన్ వచ్చేయటం ఖాయం. మరి.. కేంద్రంత తన ఆమోద ముద్ర కోసం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.