అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వదిలి పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంతో సహా ఆయన్ని అధికారులు ఓ బంకర్‌లోకి తరలించారు. ఈ అనూహ్య పరిణామానికి కారణం అక్కడ నల్ల జాతీయుల నేతృత్వంలో ఉద్ధృతంగా సాగుతున్న నిరసనే. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేతజాతి పోలీసు అధికారి అతి కిరాతకంగా కాలితో తొక్కి ప్రాణాలు పోవడానికి కారణమైన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికన్ నల్ల జాతీయుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఎన్నాళ్లీ వివక్ష అంటూ లక్షలాది మంది నల్ల జాతీయులు బయటికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇది క్రమంగా దేశమంతా విస్తరించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ఆందోళన కారులు ధ్వంసం చేస్తున్నారు.
తాజాగా దేశ అధ్యక్షుడి అధికార వాసం అయిన వైట్ హౌస్ వద్దకు నిరసన కారులు చేరుకున్నారు. వైట్ హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వైట్ హౌస్ సమీపంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలతో పాటు నిప్పురవ్వలను వెదజల్లే గ్రెనేడ్‌లను సైతం ఉపయోగించారు. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వైట్ హౌస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అతని కుటుంబ సభ్యులను అధికారులు బంకర్‌లోకి తరలించారు.
జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారిని ఉరి తీయాలన్నది నిరసనకారుల డిమాండ్. ఓ నేరానికి సంబంధించి పట్టుబడ్డ జార్జి ఫ్లాయిడ్‌ను కింద పడేసిన సదరు పోలీసు అధికారి మెడ మీద మోకాలితో నొక్కి ఉంచి ఐదు నిమిషాల పాటు అతడిని నరకయాతనకు గురి చేశాడు. తనకు ఊపిరి ఆడట్లేదని అతను అంటున్నా వినిపించుకోలేదు. చివరికతను అక్కడిక్కడే ఊపిరి వదిలేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates