స్పై కెమెరాను ఎలా కనిపెట్టేయొచ్చు?

జూబ్లీహిల్స్ లాంటి సంపన్న ప్రాంతంలోని ఒక ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన లేడీస్ బాత్రూంలో అక్కడి స్వీపింగ్ కుర్రాడు సెల్ ఫోన్ పెట్టి రికార్డు చేయటం ద్వారా.. గడప దాటిన తర్వాత బయట ఎక్కడైనా బాత్రూంకు కానీ.. ఏదైనా షాపింగ్ మాల్ లో కానీ బట్టల షోరూంలో కానీ ట్రయల్ రూంలో సీక్రెట్ గా ఏర్పాటు చేసే స్పై కెమెరాల మీద చర్చ షురూ అయ్యింది. సమస్య అందరికి తెలిసిందే. దాని గురించి మళ్లీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచనలకు బ్రేకులు వేసే అవకాశాలు ఏమున్నాయి? అన్న దానిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

కొత్త ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు అక్కడ స్పై కెమేరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? దుర్మార్గపు ఆలోచనలతో ఏమైనా పాడు పనికి ప్లాన్ చేశారా? అన్న విషయాన్ని గుర్తించటం సవాలుతో కూడుకున్న పని. కానీ.. జాగ్రత్తగా పరిశీలించటం.. కొన్ని టెక్నిక్స్ తో ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మనకు సంబంధించిన ప్రైవసీ విషయాలు నెట్టింట దర్శనమిస్తే.. దాని కారణంగా పడే వేదనతో పోలిస్తే.. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని చెప్పక తప్పదు.
ఇంతకూ స్పై కెమెరాల్ని ఎలా గుర్తించొచ్చు? అన్న విషయంలోకి వెళితే..

  • మనకు తెలీని ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎక్కడికైనా కొత్త ప్రాంతంలో దుస్తులు మార్చుకోవటం.. బాత్రూంకు వెళ్లాల్సి రావటం.. స్నానాలు చేయాల్సి వచ్చినప్పుడు.. మనం ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా చిన్న రంధ్రాలు.. నల్లని డాట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అన్నది చెక్ చేయాలి.
  • సాధారణంగా స్పై కెమెరాలు స్మోక్ డిటెక్టర్లు.. ఎయిర్ ఫిల్టర్లు.. ఏసీలు.. వాల్ పెయింటింగ్స్.. పుస్తకాలు.. మొక్కలు.. బొమ్మలు.. లైట్లు..కుషన్లు.. అలమరాలు.. టిష్యూ బాక్సులు లాంటి వాటిల్లో రహస్యంగా ఏర్పాటు చేస్తుంటారు. అందుకే.. అలాంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.
  • ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే బయటకు వచ్చేయటం మంచిది. ఒకవేళ అవసరం లేని వైర్లు.. అడాప్టర్లు లాంటివి కనిపిస్తే వాటికి కరెంటు సరఫరా ఆపేస్తే సరి.
  • స్పై కెమెరాను గుర్తించేందుకు మరో చిట్కా ఉంది. అదేమంటే.. ట్రయల్ రూంలో కానీ.. కొత్త హోటల్ గదిలో కానీ.. బాత్రూంలకు వెళ్లినప్పుడు మీ ఫోన్ తో ఎవరికైనా ఫోన్ చేయండి. అక్కడ కానీ రహస్యంగా కెమెరాను ఏర్పాటు చేసి ఉంటే.. సిగ్నల్ సమస్య ఎదురు కావొచ్చు. ఎందుకంటే.. స్పై కెమెరా ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతూ ఉంటాయన్నది మర్చిపోకూడదు. దీంతో.. ఫోన్ లో మాట్లాడేటప్పుడు గరగరమనే శబ్ధం వినిపించిందా? మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితిలో మీరున్నట్లు.
  • మీ ఫోన్ లో వైర్ లెస్ కెమెరా డిటెక్టర్.. హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి వాటిని గుర్తించేందుకు కొన్ని యాప్ లు ఉన్నాయి. వాటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే.. అలాంటి డివైజ్ ల సమాచారాన్ని మన ఫోన్ లో కనిపించేలా చేస్తుంది. దీంతో.. అక్కడ స్పై కెమెరా ఉందన్న విషయం మీకు అర్థమై..అక్కడి నుంచి మీరు వెళ్లిపోవటానికి అవకాశం ఉంటుంది.
  • చాలామంది స్పై కెమెరాలను అద్దాల వెనుక పెడుతుంటారు. ఇలాంటి వాటిని గుర్తించటం కష్టమవుతుంది. అలాంటివేళలో.. అద్దాన్ని ఒక వేలు పెట్టి చూస్తే.. మామూలు అద్దమైతే.. మనం పెట్టిన చూపుడు వేలుకు.. అద్దంలోని వేలికి మధ్య కాస్తంత గ్యాప్ ఉన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అందుకు భిన్నంగా.. మన చూపుడు వేలు.. అద్దంలోని మన వేలు కలిసిపోయినట్లు కనిపిస్తే మాత్రం అది టూవేస్ అద్దం. అలాంటి చోట్ల స్పైకెమెరా ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల స్నానాలు చేయటం కానీ.. బట్టలు మార్చుకోవటం లాంటివి అస్సలు చేయకూడదు.