శుక్రవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోడీ సన్నిహిత వర్గాలు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మోడీ ప్రధాని అయ్యాక ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులన్నింటినీ వేలం వేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఈ వేలం ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఇటీవల ఒలింపిక్ అథ్లెట్లు మోడీకి ఇచ్చిన క్రీడా పరికరాలకు అనూహ్యమైన రేట్లు పలికాయి. ఫెన్సింగ్ పోటీల్లో ఉపయోగించే కత్తికి వేలంలో రూ.10 కోట్ల రేటు పలికితే.. ఇద్దరు షట్లర్లు బహుకరించిన రాకెట్లు కూడా ఒక్కోటి రూ.10 కోట్ల రేటు పలకడం విస్మయానికి గురి చేసింది. ఐతే వీటిని మోడీకి అందించింది పెద్ద స్టార్లేమీ కాదు.
తొలిసారిగా ఒలింపిక్స్‌లో పోటీ పడి ఒక రౌండ్లో గెలిచి రెండో రౌండ్లో ఓటమి పాలైన తమిళనాడు ఫెన్సర్ భవానీ దేవి ఇటీవల మోడీని కలిసిన సందర్భంగా బహుకరించిన కత్తికి రూ.10 కోట్ల రేటు పలికింది. అలాగే పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన కృష్ణ నగార్ మోడీకి ఇచ్చిన రాకెట్ కూడా వేలంలో రూ.10 కోట్లు దక్కించుకుంది. ఇదే ఈవెంట్లో రజతం నెగ్గిన సుహాస్ యతిరాజ్ రాకెట్ సైతం రూ.10 కోట్ల రేటు పలికింది. భవానీ కత్తి బేస్ ప్రైస్ రూ.60 లక్షలు కాగా.. కృష్ణ రాకెట్ ప్రాథమిక ధర రూ.80 లక్షలు. సుహాస్ రాకెట్ బేస్ ప్రైస్ రూ.50 లక్షలు.
ఐతే ఈ వేలం ఇంకా కొనసాగుతుండటంతో ఫైనల్ రేటు ఇంకా నిర్ణయం కాలేదు. సింధు.. మోడీకి ఇచ్చిన రాకెట్, ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా బహుకరించిన ఈటెను కూడా వేలంలోకి తెచ్చారు. ప్రస్తుతానికి సింధు రాకెట్ రూ.90 లక్షల వద్ద ఉండగా.. నీరజ్ ఈటె వేలంలో రూ.1.20 కోట్ల మార్కు వద్ద ఉంది. లవ్లీనా బాక్సింగ్ గ్లవ్స్ రూ.1.8 కోట్ల రేటు వద్ద ఉన్నాయి. వచ్చే నెల 7 వరకు ఈ వేలం కొనసాగనుంది. చివరికి వీటికి ఎంత రేటు పలుకుతాయో చూడాలి.