మరో రికార్డుకు దగ్గర్లో ముకేశ్ అంబానీ


అంతకంతకూ దూసుకెళుతూ ముందుకెళుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయన వ్యక్తిగత ఆస్తులు 10వేల కోట్ల డాలర్లకు దగ్గరకు రానున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.7.30లక్షల కోట్ల సంపదనకు ఆయన చేరువయ్యారు. మరికాస్త ముందుకెళితే చాలు.. ప్రపంచంలో అతి తక్కువ మందికి సాధ్యమయ్యే పని ఆయనకు సొంతం కానుంది. ఈ హోదాను సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా అంబానీ నిలవనున్నారు.

తాజాగా విడుదల చేసిన బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. శుక్రవారం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తి 9260 డాలర్లు. అంటే.. పదివేల కోట్ల డాలర్లకు ఆయన కేవలం 740 కోట్ల డాలర్ల దూరంలోనే ఉన్నారు. మామూలుగా అయితే 740 కోట్ల డాలర్లు అంటే మాటలు కాదు. కానీ.. ముకేశ్ అంబానీకిఇదేం పెద్ద విషయం కాదు. ఆయన రిలయన్స్ కంపెనీ షేర్ అంతకంతకూ దూసుకెళుతోంది. తాజాగా పెరిగిన ధరతో ఆయనీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు. రిలయన్స్ షేర్ ర్యాలీ మరికాస్త జోరందుకుంటే చాలు ఆయన 10వేల కోట్ల డాలర్ల క్లబ్ లోకి చేరిపోతారు.

ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే ఈ స్థాయి సంపదను కలిగి ఉన్నారు. శుక్రవారం ఆయన కంపెనీ షేర్ ధర పెరగటంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.15 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం. మరెన్ని రోజుల వ్యవధిలో ఈ అరుదైన రికార్డును ముకేశ్ అంబానీ తన వశం చేసుకుంటారో చూడాలి.