కోహ్లీపై మరోసారి రూట్ దే పైచేయి

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు రథసారధి విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయడం, అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు స్థాయిలో మూడు సెంచరీలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ లో కోహ్లీపై పై చేయి సాధించిన జో రూట్…తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంక్సింగ్స్ లోనూ అదే జోరు కొనసాగించాడు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రూట్ 916 పాయింట్లతో మొదటి స్థానాంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విలియమ్సన్ (901) రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు.

మరోవైపు, బౌలింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తో టెస్టు సిరీస్ లో అదరగొడుతోన్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ‘ఆరు’ నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. భారత్ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించక ముందు కోహ్లీపై రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడని, అతడిని కట్టడి చేసిన ఘనత తన బౌలర్లదేనంటూ రూట్ కితాబిచ్చాడు. సిరీస్ గెలవాలంటే, కోహ్లీ మౌనంగా ఉండాల్సిందేనంటూ కోహ్లీపై రూట్ షాకింగ్ కామెంట్లు చేశాడు. కోహ్లిని త్వరగా ఔట్ చేసేందుకు తాము వ్యూహరచన చేశామని, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని రూట్ చెప్పాడు. టీమిండియాపై ఒత్తిడిని కొనసాగిస్తామని, సిరీస్‌ను సమం చేయడానికి చాలా కష్టపడ్డామని రూట్ అన్నాడు.