వరల్డ్ నెంబర్ 2 స్థానం దక్కించుకున్న నీరజ్ చోప్రా..!

భారత జావలెన్ త్రోవర్, గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. జావెలిన్ లో.. ప్రపంచ నెంబర్ 2 స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించాడు. ఏకంగా స్వర్ణం సాధించి భారతీయుల 100ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

కాగా తొలి గోల్డ్ మెడ‌ల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా తాజా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డం నీర‌జ్ కెరీర్‌నే మార్చేసింది. ఫైన‌ల్లో 87.58 మీట‌ర్ల దూరం జావెలిన్ విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో నిలిచాడు.

ప్ర‌స్తుత ర్యాంకింగ్స్‌లో నీర‌జ్ 1315 పాయింట్ల‌తో జ‌ర్మ‌నీ స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ జోహ‌నెస్ వెట‌ర్ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. వెట‌ర్ 1396 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏడుసార్లు 90 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన వెట‌ర్‌.. ఒలింపిక్స్ ఫైన‌ల్లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ఇదిలా ఉండగా..ఒలింపిక్స్‌లో ఫైనల్ కోసం నిర్వహించిన అర్హత పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో యావత్తు భారత్ అతడికి ఫైనల్లో పతకం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్లుగానే నీరజ్ చోప్రా పతకం సాధించాడు. భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన ఘనతతో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ జావెలిన్ త్రో డే’గా జరుపుకోవాలని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.