ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. అయితే… కరోనా సోకితే కనీసవారందూ ప్రాణాలు కోల్పోవడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండగా.. మిగిలినవారు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుతున్నారు. అయితే.. ఈ కరోనాను మించిన మరో ప్రాణాంతక వైరస్ ని ఆఫ్రికాలో కనుగొన్నారు. ఇది సోకినవారందరూ కచ్చితంగా చనిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా గినియాలో వెలుగు చూసిన ఈ వైరస్ పేరు మార్బర్గ్.. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుందని.. దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దక్షిణ గెక్కెడౌ ప్రిఫెక్చర్ ప్రాంతంలో తొలి మార్బర్గ్ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్బర్గ్ వైరస్ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు. మార్బర్గ్ సాధారణంగా రౌసెట్టస్ గబ్బిలాలకు ఆవాసాలుగా మారిన గుహలు, మైన్స్ల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వైరస్ వ్యాప్తిలో మరణాల రేటు 88 శాతంగా ఉంటుందని ఆయన తెలిపారు.
మార్బర్గ్ కూడా ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన వైరస్సే. కాకపోతే దాని కన్నా ఇది మరింత ప్రమాదకారి. ఈ వైరస్ సోకిన వారు రక్తస్రావ జ్వరం బారిన పడతారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్గ్రేడ్, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్బర్గ్, ప్రాంక్ఫర్ట్ వ్యాధులను గుర్తించారు. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తుల రక్తస్రావాలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది. వైరస్ పొదిగే కాలం రెండు నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. 2008 లో, ఉగాండాలోని రౌసెట్టస్ గబ్బిలాలు నివసించే గుహను సందర్శించిన ప్రయాణికులలో నిపుణులు రెండు కేసులు గుర్తించారు.
మార్బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవి ఒక వారం పాటు కొనసాగుతాయి. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు లోపలికి పోయి.. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక.. విపరీతమైన బద్ధకంగా ఉంటారు.
మలేరియా, టైఫాయిడ్, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినట్లు.. మార్బర్గ్ను గుర్తించడం కష్టమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్టీపీసీఆర్ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చని తెలిపింది.