తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని జునోనా ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన అనే మహిళ కుటుంబం నివసిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజున కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది.
పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతతో పోరాడింది. ఈ క్రమంలో ఆమెపైనా చిరుత దాడి చేసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి మరి పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు దానిని చితకబాదింది. దీంతో ఏమీ చేయలేక చిరుత అడవుల్లోకి పారిపోయింది. బిడ్డ కోసం ఆ తల్లి చేసిన పోరాటం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది.