రెజ్లర్ సుశీల్ తో పోలీసుల ఫోటోలు.. నెట్టింట విమర్శలు..!

యువ రెజ్లర్ ని హత్య చేసిన కేసులో… రెజ్లరర్ సుశీల్ కుమార్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు సుశీల్ కుమార్, పోలీసులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడితో.. సెలబ్రెటీలాగా పోలీసులు ఫోటో దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. హత్య కేసులో సుశీల్‌ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్‌ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్‌ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్‌ కావడంతో దుమారం మొదలైంది.

తానొక హత్య కేసులో అరెస్టు అయ్యాననే బాధ కనీసం లేకుండా… సుశీల్ కూడా నవ్వుతూ ఫోటోకి ఫోజు ఇవ్వడం గమనార్హం. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్‌ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్‌ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉ‍న్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అసోషియేషన్‌ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్‌ కుమార్‌పై సుశీల్‌ కుమార్‌, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.