సెకండ్ వేవ్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు బయటకు వస్తున్నారు. దీనికి తగ్గట్లే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లు ఎత్తేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా.. రానున్న రోజుల్లో అవి కూడా అన్ లాక్ దిశగా అడుగులు వేయనున్నట్లు చెబుతున్నారు. దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయినట్లేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. థర్డ్ వేవ్ మాటేమిటి? ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. థర్డ్ వేవ్ మీద ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు భారీ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు పలు అంశల్ని గుర్తించారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిందని.. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. సెప్టెంబరు – అక్టోబరు మధ్య కాలంలో దేశానికి థర్డ్ వేవ్ షురూ అవుతుందని అంచనా వేశారు.
జులై 15 నాటికి దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ సాగితే.. థర్డ్ వేవ్ ఏ రీతిలో ఉంటుందన్న అంచనాను వేశారు. దీని ప్రకారం అక్టోబరులో గరిష్ఠానికి చేరుకుంటుందని చెబుతున్నారు. వారి అంచనాల ప్రకారం థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదన్న అంచనా వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ అక్టోబరులో గరిష్ఠానికి చేరుకుంటుందని.. సెకండ్ వేవ్ తో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు.అంతేకాదు.. సెకండ్ వేవ్ లో గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే.. అది సెప్టెంబరు నాటికే కనిపించొచ్చని చెప్పారు.
ఒకవేళ దేశ ప్రజలు కొవిడ్ నిబంధనల్ని పాటించకుంటే మరోసారి సెకండ్ వేవ్ మొదట్లోనే వస్తుందన్నారు. అంతేకాదు.. సెకండ్ వేవ్ తో పోలిస్తే గరిష్ఠ తీవ్రత తక్కువగా ఉంటుందని తేల్చారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా.. సెకండ్ వేవ్ పూర్తిగా క్షీణించినట్లుగా అధికారులే చెబుతున్నారు. తాము వేసిన అంచనాల్లో వ్యాక్సిన్ లెక్కను పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఒకవేళ టీకా కార్యక్రమం పరిగణలోకి తీసుకుంటే.. గరిష్ఠ స్థాయి తీవ్రత తగ్గుతుందని చెప్పారు. సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ లో ఉన్న దేశ ప్రజలకు ఐఐటీ కాన్పూర్ కాసింత భరోసాను ఇస్తుందని చెప్పక తప్పదు.