ఖాళీ స్టేడియంలో ఐపీఎల్.. జరిగేదెప్పుడంటే?

మాయదారి రోగం కమ్మేసిన వేళ.. యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. ఎక్కడి వారక్కడే ఉండిపోవాల్సింది. జరగాల్సినవెన్నో వాయిదా పడిపోయాయి. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలు ఎవరికి వారుగా..తమకు తగినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకటించిన మినహాయింపుల్లో భాగంగా.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలను వినియోగించుకోవచ్చన్న మాటతో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతోంది.

నిజానికి అన్ని బాగుంటే.. ఈపాటికి ఐపీఎల్ సీజన్ షురూ కావటం.. యావత్ దేశం.. ఆ జోష్ లో మునిగిపోయేది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను వాయిదా వేశారు. ఎప్పుడైతే ఖాళీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా క్రీడా పోటీలు నిర్వహించుకోవచ్చన్న అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుందో.. ఐపీఎల్ సీజన్ మీద కొత్త ఆశలు చిగురించాయి. ఖాళీ స్టేడియంలో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆటగాళ్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రేక్షకులు ఎవరూ లేని క్రీడా సముదాయాల్లో క్రీడల్ని నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ప్రేక్షకుల కేరింతలు.. ఉత్సాహం.. భావోద్వేగాల నడుమ ఆట జరిగే దానికి.. అందుకు భిన్నంగా జరిగే వాటికి మధ్య ప్రజల ఆదరణ ఎలా ఉంటుందన్నది అసలు ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఇటీవల పరిణామాల నేపథ్యంలో సంపన్నమైన బీసీసీఐ మొదలు.. పలు క్రికెట్ బోర్డులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ సమస్యల్ని అధిగమించేందుకు అవసరమైన ప్రణాళికల్ని ఆయా బోర్డులు సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ ను ఈ అక్టోబరులో నిర్వహిస్తే బాగుంటుందనన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐపీఎల్ ను.. ఇతర టోర్నమెంట్లను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ కు భిన్నమైన ఐపీఎల్ సీజన్ చూడటం ఖాయమని చెప్పక తప్పదు. నిశ్శబద్దంగా ఉండే ఖాళీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ కు ప్రజాదరణ ఎలా ఉంటుందో చూడాలి.