బీసీసీఐ వినూత్న ప్రయోగం

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును ఎంపిక చేయడం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరుగా కెప్టెన్లను ఎంపిక చేయడం విదేశీ జట్ల విషయంలో చూస్తుంటాం. కానీ ఇండియన్ క్రికెట్ టీం విషయంలో సాధారణంగా ఇలా జరగదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను చూస్తుంటాం. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత సీనియర్లంతా తప్పుకుని.. ధోని నేతృత్వంలో ఓ యువ జట్టు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లి అసాధారణ విజయం సాధించడం తెలిసిందే. ఐతే ఇప్పుడు తాత్కాలికంగా అలాంటి ప్రయోగమే చేయబోతోంది బీసీసీఐ.

వచ్చే నెల 2న కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ముందు న్యూజిలాండ్‌తో జూన్ 18-22 తేదీల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాక.. జులైలో వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది కోహ్లీసేన.

ఐతే జులైలో కోహ్లి బృందం ఇంగ్లాండ్‌లో ఉండగానే మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లబోతుండటం విశేషం. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని ధావన్, హార్దిక్ పాండ్య, చాహల్, భువనేశ్వర్ లాంటి ఆటగాళ్లతో వేరే జట్టును ఎంపిక చేసి శ్రీలంకకు పంపబోతోంది బీసీసీఐ. ఈ పర్యటనలో టీమ్ ఇండియా.. లంకతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుందట. అక్టోబరులో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో వన్డే, టీ20 స్పెషలిస్టులు చాలామంది ఖాళీగా ఉండటంతో ఈ సిరీస్‌కు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ.

కోహ్లి, రోహిత్, బుమ్రా లాంటి పెద్ద ఆటగాళ్లు లేకపోయినా.. భారత్‌కు బలమైన రిజర్వ్ బెంచ్ ఉండటం.. లిమిటెడ్ ఓవర్ స్పెషలిస్టులు బోలెడంతమంది అందుబాటులో ఉండటంతో ఈ సిరీస్‌కు జట్టును పంపడంలో బీసీసీఐకి ఎలాంటి ఇబ్బంది లేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీ షా లాంటి కుర్రాళ్లు ఈ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈ పర్యటన ద్వారా యువ ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కడమే కాక.. బీసీసీఐకి మంచి ఆదాయమూ లభిస్తుంది. మరి జట్టు లంకలో ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)