అనుకున్నదే అయింది. భయపడిందే జరిగింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది. లీగ్‌లో కరోనా కేసులు బయటపడటం.. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం అనివార్యం అయింది. లీగ్‌ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, ఆ జట్టు సీఈవో విశ్వనాథన్, సీఎస్కే టీం బస్ క్లీనర్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. బయో బబుల్ లోపల ఇలా వరుసగా కేసులు బయటపడుతుండటం, కేసులు పెరుగుతూ పోతుండటంతో ఇక ఇది ఆగేది కాదని తేలిపోయింది.రెండు నెలల కిందట పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ ఇలాగే బబుల్ లోపల కేసులు వెలుగు చూశాయి. కేసులు పెరుగుతూ పోయాయి. ఒకసారి ఇలా బబుల్ బ్రేక్ అయిందంటే ఇక కేసులు అంత తేలికగా ఆగవు. ఇంత పెద్ద టోర్నీని నిర్వహించడం తేలిక కాదు. పాజిటివ్‌గా తేలిన బాలాజీ చెన్నై డ్రెస్సింగ్ రూంలోనూ తిరగడంతో ఆ జట్టు మొత్తం వారం పాటు ఐసోలేషన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లను వాయిదా వేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సైతం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులోనూ కరోనా కేసు వెలుగు చూడటంతో ఆ జట్టునూ ఐసొలేషన్‌లోకి పంపాల్సి వచ్చింది. ఇలా మూడు జట్లు పక్కకు వెళ్లిపోవడంతో ఇక మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాదని తేలిపోయింది. మ్యాచ్‌లను కొన్ని రోజులు ఆపి.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఏం చేయాలో చూద్దామని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. వారం పది రోజులు వేచి చూసి ఆ తర్వాత అవకాశాన్ని బట్టి రోజుకు రెండు మ్యాచ్‌లతో లీగ్‌ను కొనసాగించి సాధ్యమైనంత త్వరగా టోర్నీని ముగించడానికి ప్రయత్నించే అవకాశముంది.