బ్రేకింగ్‌: కూక‌ట్‌ప‌ల్లి లో కాల్పులు.. గార్డు మృతి.. 5 ల‌క్ష‌ల దోపిడీ!

హైద‌రాబాద్ న‌డిబొడ్డు ప్రాంతం.. కూక‌ట్‌ప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి ఆల్విన్‌ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న హెచ్‌డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై దాడి చేసి.. తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విష‌యంలోకి వెళ్తే.. గురువారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త‌, క‌రోనా కార‌ణంగా జ‌న‌స‌మ్మ‌ర్థంత‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్స‌ర్ బైక్‌పై దూసుకుని వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు.. క్ష‌ణాల్లో ఏటీఎంలోకి దూసుకువెళ్లారు. నిజానికి ఆ స‌మ‌యంలో ఏటీఎంలో డ‌బ్బు నింపుతున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఏటీఎం ద‌గ్గ‌ర కాప‌లా కాస్తున్నారు.

అయితే.. దూసుకునివ‌చ్చిన యువ‌కులు.. ఇద్ద‌రూ ముందు సెక్యూరిటీ గార్డుల‌పై దాడి చేసి కాల్పులు జ‌రిపారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకునే లోగానే.. దుండ‌గులు ఏటీఎంలో పెడుతున్న క్యాష్ నుంచి రూ.5 ల‌క్ష‌లు దోచుకువెళ్లారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో అలీ అనే సెక్యూరిటీ గార్డు మృతి చెంద‌గా.. మ‌రో గార్డు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. విష‌యంపై ఆరాతీస్తున్నారు. దుండగులు ఇద్ద‌రూ 25 ఏళ్ల‌లోపు వారేన‌ని పోలీసులు భావిస్తున్నారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏటీఎంలో డ‌బ్బులు నింపుతున్న స‌మ‌యంలోనే దుండ‌గులు ఎందుకు వ‌చ్చారు? వారికి ముందుగానే స‌మాచారం అందిందా? లేక ఇంటి దొంగ‌లే ఈ ప్లాన్ చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంటుంద‌ని అంటున్నారు పోలీసులు. ఏదేమైనా.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.