కరోనా పేషంట్లు మిస్సింగ్ ?

ఇపుడిదే విషయం తిరుపతిలోని ఉన్నతాధికారులను టెన్షన్ పెట్టేస్తోంది. గడచిన రెండు నెలలుగా ఒక్క తిరుపతిలోనే 9600 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో అత్యధికులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. కొందరు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మరికొందరు హోం ఐసొలేషన్లో ఉన్నారు. మరికొందరు చుట్టుపక్కలున్న తమ ఊర్లకు వెళ్ళిపోయారు. ఈ నాలుగు తరగతుల రోగుల లెక్క అధికారుల దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి సమస్యా లేదు.

అయితే ఐదో తరగతి రోగులు కూడా ఉన్నారట. వీళ్ళసంఖ్య సుమారు 1050 దాకా ఉంది. వీళ్ళ వల్లే ఉన్నతాధికారులు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పైన చెప్పినట్లుగా 9600 మంది కరోనా వైరస్ సోకిన రోగుల్లో ఇపుడు 1050 మంది అడ్రస్ దొరకటంలేదని సమాచారం. వీళ్ళ ఆచూకీ కోసం అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.

జరిగిందేమిటంటే చాలామందిలాగే వీళ్ళు కూడా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకునేటపుడు మొబైల్ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఇచ్చారు. అయితే పరీక్షల్లో వీళ్ళకు కరోనా వైరస్ సోకినట్లు వచ్చింది. అదే విషయం వీళ్ళకు చెబుదామని వైద్య సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లేదా పనిచేయటం లేదని వస్తోందట. ఇక ఇంటి అడ్రస్ కు వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తే అలాంటి పేరుగలవారు ఎవరు అడ్రస్ లో లేరని చెప్పారట.

అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే మొబైల్ నెంబర్ లేదా ఇంటి అడ్రస్ రెండు తప్పుడువే. కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి ? ఎందుకు మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ ఎందుకు తప్పుడువి ఇవ్వాలి ? ఇపుడిదే ప్రశ్న అధికారులను వేధిస్తోంది. వీళ్ళంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ? ఎంతమందికి అంటించారో అర్ధం కావటంలేదు. అందుకనే అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.