వణికిపోతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిచెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో వణికిపోతోంది. గడచిన 8 వారాల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే 9164 కేసులు నమోదయ్యాయి. అంటే వారానికి సగటున వెయ్యి కేసులు నమొదైనట్లు లెక్క. వారానికి వెయ్యికేసులంటే లాక్ డౌన్ పెట్టడంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను మించిపోయిందన్నమాటే.

తిరుపతిలో ఇన్ని కేసులు నమోదవ్వటానికి ప్రముఖ పుణ్యక్షేత్రం కావటమే కారణం. తిరుమలలోని శ్రీవారి దర్శనార్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా రోజూ తిరుపతి మీదుగానే తిరుమల చేరుకుంటుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం అయిపోగానే తిరిగి వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోరు.

ఎక్కడెక్కడినుండి ఎప్పుడో ఒకసారి శ్రీవారి దర్శనానికి వస్తారు కాబట్టి తిరుపతి బేస్ పెట్టుకుని శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, చిత్తూరుకు దగ్గరలోని కాణిపాకం తదితర దేవాలయాలన్నింటినీ చూస్తారు. అంటే తిరుమలకు వచ్చే భక్తులు సగటున రెండు రోజులు తిరుపతిలోనే ఉంటారు. కాబట్టే తిరుపతికి రోజువచ్చే భక్తుల సంఖ్య సుమారు 3 లక్షలుంటుంది.

తిరుపతి పట్టణం వ్యాసార్ధంరీత్యా చిన్నది. పుణ్యక్షేత్రం కాబట్టి చాలా ప్రముఖమైనది. పైగా దర్శనార్ధం ఎక్కడెక్కడినుండో వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు కరోనాను కూడా దర్శనానికి తీసుకొస్తున్నారు. కరోనా ఉందనే కారణంతో కొందరు భక్తులను తిరుమలకు అనుమతించకపోయినా ఎలాగూ వచ్చాం కాబట్టి మిగిలిన దేవాలయాలను చూసుకుని వెళదామన్న ఉద్దేశ్యంతో తిరుపతిలోనే ఉంటారు.

ఈ కారణంగానే తిరుపతిలో ఊహించనిరీతిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తిరుమల దర్శనాలను నూరుశాతం ఆపేస్తేకానీ తిరుపతిలో కేసుల తీవ్రత తగ్గదని పోయిన ఏడాది నిరూపితమైంది. కేసులే కాదు మరణాలు కూడా తిరుపతిలో పెరిగిపోతున్నాయి. అందుకనే ముందుగా తిరుపతిని కంటైన్మెంట్ సిటీగా ప్రకటించటంతో పాటు మధ్యాహ్నం నుండి ఉదయం 7 వరకు కర్ఫ్యూ కూడా విధించారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, చిత్తూరులో కూడా మినీ లాక్ డౌన్ ప్రకటించేశారు. మొత్తానికి సెకెండ్ వేవ్ తిరుపతిని వణికించేస్తోందన్నది వాస్తవం.