కరోనా సెకండ్ వేవ్ వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండేందుకు ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన శాఖలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మూడు పోలీసు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) లోని ముగ్గురు పోలీసు కమిషనర్లు (అంజనీకుమార్, సజ్జన్నార్, మహేశ్ భగవత్) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు తీసుకునే నిర్ణయాలు చూసినప్పుడు.. మిగిలిన వారి కంటే వారే బెటర్ అన్న భావన కలుగక మానదు. సాధారణంగా పోలీసులు పోలీసింగ్ చేయటం.. నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. భద్రతా ఏర్పాట్లు చేయటం లాంటివి చేస్తుంటారు.
అందుకు భిన్నంగా మహానగర ప్రజలకు వివిధ రూపాల్లో సాయం చేసేందుకు వీలుగా కార్యక్రమాల్నినిర్వహించటం గడిచిన కొద్దికాలంగా చూస్తున్నాం. సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ.. మరోసారి ఈ పోలీస్ త్రిమూర్తులు రంగంలోకి దిగారు. ఎవరికి తోచిన రీతిలో వారు సహాయ కార్యక్రమాల్ని చేపట్టారు. తమ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు వీలైనన్ని ఎక్కువ సదుపాయాలు కల్పించేలా వారి నిర్ణయాలు ఉండటం గమనార్హం. నేతల కంటే వీరి తీరే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తాజాగా ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం ఉన్న వారు.. ఇప్పుడున్నపరిస్థితుల్లో రావొద్దని.. అందుకు బదులు 9490616780 నెంబరుకు ఫోన్ చేస్తే 24 గంటల పాటు ప్రత్యేక హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఒక లిస్టు విడుదల చేశారు. ధర్నాలు.. ఆందోళనలు లాంటివి చేయొద్దని.. ఎంతో అవసరమైతే పోలీస్ స్టేషన్ కు రావొద్దని.. దానికి బదులు తామిచ్చిన నెంబరును వినియోగించుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరోలాంటి సేవల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్సు సేవలు చాలా అవసరం. ఆసుపత్రికి వెళ్లాలన్నా.. ఆసుపత్రి నుంచి ఇంటికి రావాలన్నా.. ఇలా ప్రతి సందర్భంలోనూ అవసరమయ్యే అంబులెన్సు సేవల్నిఅందుబాటులోకి తీసుకొచ్చారు సైబరాబాద్ కమిసనర్ సజ్జన్నార్. 94906 17400, 94906 17431 నెంబర్లకు ఫోన్ చేస్తే.. అంబులెన్సు సేవల్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం 12 అంబులెన్సుల్ని అందుబాటులోకి తేవటమే కాదు.. మరో రెండు మూడు రోజుల్లో టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు వైద్యులతో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్.. సైబరాబాద్ పోలీసులకు తగ్గట్లే రాచకొండ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ వినూత్న రీతిలో కొత్త సర్వీసుల్ని తీసుకొచ్చారు. ఉదయం వేళలో వ్యాక్సిన్ల కోసం వెళ్లే వారికి క్యాబ్ సర్వీసును ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అవసరమైతే ఎలాంటి వసతి దొరకని దుస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం మహీంద్రా లాజిస్టిక్స్ సాయంతో ఉచిత క్యాబ్ సర్వీసును తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకోసం 94906 17234 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా.. ఏ కమిషనరేట్ కు సంబంధించిన ఆ పోలీసు కమిషనరేట్ సీపీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. నగర జీవులకు ఉపయుక్తంగా మారాయని చెప్పక తప్పదు.