40 కోట్లమంది టీవీలే చూడటంలేదట

మనదేశంలో ఉన్న టెలివిజన్లు 21 కోట్లేనని తాజా లెక్కల్లో తేలింది. దేశజనాభా 130 కోట్లన్న విషయం అందరికీ తెలిసిందే. జనాభా 130 కోట్లన్నమాటే కానీ కుటుంబాల సంఖ్య 30 కోట్లు. అంటే సగటును ఒక్కో కుటుంబంలో 4.5 సభ్యులున్నట్లు లెక్క. ఈ లెక్కలన్నీ ఏదో సర్వే సంస్ధ విడుదల చేసింది కాదు. బార్క్ అంటే బ్రాడ్ క్యాస్టింగ్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్ విడుదల చేసిన లెక్కలు కాబట్టి దాదాపు వాస్తవమే అని అనుకోవాలి.

దేశంలో ఎన్ని టీవీలున్నాయి, ఎంతమంది ప్రతిరోజు టీవీలు చూస్తున్నారు, ఏ కార్యక్రమాన్ని, ఏ సమయంలో ఎంతమంది చూస్తున్నారనే విషయాలపై బార్క్ ప్రతిరోజు వాచ్ చేస్తునే ఉంటుంది. ఇందుకోసం తనదైన పద్దతిలో ఏవో సాంకేతిక పరిజ్ఞాన్ని కూడా అనుసరిస్తోందిలేండి. సినిమాలు, సీరియళ్ళు, న్యూస్ ప్రోగ్రాములకైనా బార్క్ ఇచ్చే రేటింగ్స్ చాలా కీలకం. ఈ రేటింగ్స్ పై ఆధారపడే అనేక సంస్ధలు అడ్వర్టైజ్మెంట్లను ఇస్తుంటాయి.

ఇంతటి కీలకమైన పాత్ర పోషించే బార్క్ విడుదల చేసిన లెక్కల ప్రకారం టీవీ చూసే వ్యక్తుల సంఖ్య 89.2 కోట్లట. అంటే దేశజనాభా 130 కోట్లున్నా టీవీలు చూసే జనాభా మాత్రం 89 కోట్లేనంటే ఆశ్చర్యంగానే ఉంది. తాజా లెక్కల ప్రకారం టీవీలకు ఇంకా మనదేశంలో సుమారు 40 కోట్లమంది దూరంగా ఉన్నారంటే నమ్మకం కలగటంలేదు.

గడచిన ఏడాది కారణంగా కరోనా వైరస్ భయంతో దేశంలోని చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు. ఈ కారణం వల్లే టీవీలు చూసే వారి సంఖ్య 6.7 శాతం పెరిగిందట. లేకపోతే ఈ సంఖ్య కరోనాకు ముందు 83 కోట్లేనని బార్క్ చెప్పింది. ఇంకా 40 కోట్లమందికి టీవీలు చూసే భాగ్యం ఎప్పటికి దక్కుతుందో ఏమో. అయితే టీవీలు చూడలేకపోవటం వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయని మనస్తత్వశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

టీవీలు చూసే వాళ్ళల్లో ఉండే మనోవికారాలేవీ టీవీలు చూడని వాళ్ళలో దాదాపు ఉండవని నిపుణులు బల్లగుద్దకుండానే చెబుతున్నారు. మరి మిగిలిన వాళ్ళని కూడా టీవీలకు అలవాటు చేసి వాళ్ళ మానసిక వికారులను చేయటమా ? లేకపోతే వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వటమా అనేది తేల్చాలి.