ఐపీఎల్ నుంచి టాప్ ప్లేయ‌ర్ ఔట్


ఐపీఎల్ మొద‌లవ్వ‌గానే గాయాల బాధ కూడా ఆరంభం అయిపోతుంది. హై ఇంటెన్సిటీతో సాగే ఈ టోర్నీలో గాయాల పాలై కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యే ఆట‌గాళ్లు కొంద‌రైతే.. మొత్తంగా టోర్నీకే అందుబాటులో లేకుండా పోయేవాళ్లు ఇంకొంద‌రు. ఈసారి ఐపీఎల్ ఆరంభం కావ‌డానికి ముందు కొంద‌రు కీల‌క ఆట‌గాళ్లు గాయాల పాలై టోర్నీకి దూర‌మ‌య్యారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ టీమ్ ఇండియా త‌ర‌ఫున మ్యాచ్ ఆడుతూ గాయ‌మై లీగ్‌కు అందుబాటులో లేకుండా పోగా.. ఇదే సిరీస్‌లో గాయ‌ప‌డి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ టోర్నీకి దూర‌మ‌య్యాడు. ఇప్పుడు లీగ్ ఆరంభ‌మ‌య్యాక ఒక అగ్ర‌శ్రేణి ఆట‌గాడు ఉన్న‌ట్లుండి టోర్నీ నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది. ఆ ఆట‌గాడే ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ఇత‌ను కీల‌క ఆట‌గాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల‌లో స్టోక్స్ ఒక‌డు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సోమ‌వార‌మే పంజాబ్ కింగ్స్‌తో ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రాయ‌ల్స్ స్వ‌ల్ప తేడాతో ఓడింది. మ్యాచ్‌లో క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే ప్ర‌య‌త్నంలో స్టోక్స్ వేలు విరిగింది. ముందు గాయం చిన్న‌దే అనుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్ అయ్యాక‌ స్టోక్స్ బ్యాటింగ్‌కు కూడా వ‌చ్చాడు. కానీ డ‌కౌటై వెనుదిరిగాడు. వేలు ఇబ్బంది పెడుతుండ‌టంతో స్కానింగ్ చేసి చూడ‌గా ఫ్రాక్చ‌ర్ ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఆ గాయం మాన‌డానికి నెలా నెల‌న్న‌ర ప‌ట్టేలా ఉండ‌టంతో స్టోక్స్ టోర్నీకి దూరం కాక త‌ప్ప‌లేదు.

ఇప్ప‌టికే జోఫ్రా ఆర్చ‌ర్ లాంటి కీల‌క ఆట‌గాడిని దూరం చేసుకున్న రాజ‌స్థాన్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బే. గ‌త సీజ‌న్లో జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ను కూడా వ‌దిలిపెట్టేశారు. స్టోక్స్ దూరం కావ‌డంతో బాగా బ‌ల‌హీన ప‌డ్డ రాయ‌ల్స్.. టోర్నీలో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి. స్టోక్స్ లాంటి ఆట‌గాడు దూరం కావ‌డం అభిమానుల‌కు నిరాశ క‌లిగించేదే.