ఐపీఎల్‌లో తెలుగు క్రికెట‌ర్‌.. జెర్సీ మూమెంట్‌

భార‌తీయుల‌కు అత్యంత ఇష్ట‌మైన రెండు విష‌యాలు.. సినిమా, క్రికెట్. ఈ రెంటికీ ముడి పెడితే యువ‌త‌కు అంత‌కంటే వినోదం మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే క్రికెట్ నేప‌థ్యంలో తీసిన సినిమాలు చాలా వ‌ర‌కు గొప్ప ఫ‌లితాన్నందుకున్నాయి. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన నేచుర‌ల్ స్టార్ నాని సినిమా జెర్సీ క్రికెట్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని స‌న్నివేశాలు ఎంత ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

ముఖ్యంగా త‌న‌కు రంజీ జ‌ట్టులో చోటు ద‌క్కాక‌.. నాని వెళ్లి రైల్వే స్టేష‌న్‌లో ట్రైన్ శ‌బ్దం మాటున గ‌ట్టిగా అరుస్తూ భావోద్వేగానికి గుర‌య్యే స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌పై చెర‌గ‌ని ముద్ర వేసింది. ఆ స‌న్నివేశం ఒక క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. జీవితంలో ఒక గొప్ప విజ‌యం సాధించిన సంద‌ర్భంలో అలాంటి భావ‌న‌కే గుర‌వుతారు అంద‌రూ.

స్వ‌యంగా ఒక పేరున్న‌ క్రికెట‌ర్ కూడా జెర్సీ సినిమాకు, అందులోని ఆ స‌న్నివేశానికి విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యాడు. ఒక క్రికెట‌ర్‌గా త‌న జీవితంలోనూ అలంటి మూమెంట్ వ‌చ్చిన‌పుడు జెర్సీ సినిమానే గుర్తుకు వ‌చ్చింద‌ని తెలిపాడు. ఆ క్రికెట‌ర్ పేరు హ‌రి శంక‌ర్ రెడ్డి. క‌డ‌ప‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌల‌ర్‌.. ఆంధ్రా త‌ర‌ఫున దేశ‌వాళీ క్రికెట్లో స‌త్తా చాటి ఐపీఎల్ జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ దృష్టిని ఆక‌ర్షించాడు. ఇటీవ‌లి వేలంలో అత‌ణ్ని ఆ జ‌ట్టు కొనుక్కుంది.

ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న అత‌ను.. చెన్నై మీడియం టీంతో సంభాషించాడు. ఈ సంద‌ర్భంగా తెలుగులోనే మాట్లాడుతూ.. జెర్సీ సినిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో తాను ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాన‌ని.. క్రికెట‌ర్ల భావోద్వేగాల‌ను ఆ సినిమాలో చాలా బాగా చూపించార‌ని, ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి తాను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాన‌ని హ‌రిశంక‌ర్ తెలిపాడు. తాను ఐపీఎల్ వేలంలో చెన్నై జ‌ట్టుకు ఎంపికైన‌పుడు త‌న రూంలో స‌రిగ్గా అలాగే అరిచాన‌ని, అప్పుడు జెర్సీ సినిమానే గుర్తుకొచ్చింద‌ని చెప్పాడు. ఈ వీడియోను సీఎస్‌కే టీం ట్విట్ట‌ర్లో పంచుకుంటూ.. ఈ వీడియో చూడాల‌ని నానీని కోరింది. నాని చూసేశా అంటూ బ‌దులిస్తూ ల‌వ్ ఎమోజీ పెట్ట‌డం విశేషం.