చిచ్చు పెట్టిన మొబైల్ గేమ్.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, గన్నవరంలోని హరిజనవాడకు చెందిన ఓ గ్యాంగ్, పామర్తి నగర్ కు చెందిన మరొక గ్యాంగ్ స్థానిక బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలిశారు. ఇరువర్గాల మధ్య మొబైల్ ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. నాలుగు సార్లు ఈ గేమ్ ఆడగా ఇరువర్గాల వారు రెండు సార్లు గెలిచారు. ఈ విధంగా గేమ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల వారు మేము బాగా ఆడాము అంటే మేం బాగా ఆడాము అని ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.

ఈ క్రమంలోనే తమ వారిని కొడుతున్నారంటూ హరిజనవాడకు చెందిన 30 మంది, పామర్తి నగర్ కు చెందిన 30 మంది హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పెద్దఎత్తున కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గణేష్ అనే యువకుడితో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.