మయున్మార్ సైన్యం కాల్పుల్లో ఇప్పటిదాకా సుమారు 600 మందికిపైగా చనిపోయినట్లు అంచనా. మయున్మార్ లోని సైనిక పాలనపై జనాలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యం చేతిలో యావత్ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేశారు సైన్యాధికారులు. వీరి చెరనుండి పరిపాలనను విడిపించుకునేందుకు దేశంలోని నలుమూలల్లోని జనాలు స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఆందోళనలు తారాస్ధాయికి చేరుకోవటంతో మూడురోజుల క్రితం సైన్యం మొదటిసారి జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అప్పటి కాల్పుల్లో 114 మంది చనిపోయినట్లు లెక్కలు తేల్చారు. మగ, ఆడ తేడాలేకుండా చివరకు చిన్న పిల్లలను కూడా సైన్యం కాల్చిచంపేసింది. దాంతో అంతర్జాతీయ సమాజం+మానవ హక్కుల సంఘాలు గోల మొదలుపెట్టేశాయి. అమెరికాతో సహా చాలా దేశాలు మయున్మార్ తో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
ఇంత జరుగుతున్నా సైన్యం మాత్రం తాను అనుకున్నట్లే చేస్తోందట. గడచిన రెండు రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యం జనాలపై కాల్పులు జరుపుతునే ఉంది. మొదటిరోజు జరిగిన కాల్పుల్లోనే 114 మంది కాదని ఇంకా ఎక్కువమందే చనిపోయారనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. చనిపోయిన వారి సంఖ్యకన్నా రెట్టింపు తీవ్ర గాయాలైన వారున్నారని కూడా అంటున్నారు.
ఇదే విషయమై మయున్మార్ లోని అసిస్టెంట్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ ( ఏఏపీపీ) మాట్లాడుతూ ఇఫ్పటికి సుమారుగా 600 మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించింది. ఇంతకు రెట్టింపు మంది ఆందోళనకారులు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరినట్లు కూడా చెప్పింది. బుల్లెట్ గాయాలైన వారిలో బార్డర్ దాటి మనదేశంలోకి కూడా వచ్చేశారు. అయితే వారి లెక్కంతని తేలలేదు. మొత్తానికి అంతర్జాతీయ సమాజాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా సైన్యం తాను అనుకున్నది అనుకున్నట్లే చేసుకుపోతోంది.